మద్యం కేసులో సంబంధం లేదని కోర్టుకు కవిత స్పష్టం

New Delhi: BRS leader K Kavitha being produced at the Rouse Avenue court in the Delhi excise policy-related money laundering case, Tuesday, in New Delhi, April 9, 2024. (PTI Photo)(PTI04_09_2024_000059B)

మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను త‌ప్పు చేశాన‌న‌డానికి ఆధారాల్లేవని, రెండున్న‌రేళ్ల విచార‌ణ‌లో ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదని పేర్కొంటూ ఈ కేసులో జైలులో ఉన్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత మంగళవారం కోర్టుకు నాలుగు పేజీల లేఖ సమర్పించారు. 
 
మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న క‌వితకు మంగళవారంతో  జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ ముగియ‌డంతో కోర్టులో హాజ‌రుప‌రిచారు. మ‌ళ్లీ రెండు వారాల పాటు క‌విత‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడేందుకు జ‌డ్జి అనుమ‌తించ‌లేదు.
దానితో నాలుగు పేజీల లేఖ‌ను అందించారు. 
 
వేరే వ్య‌క్తుల స్టేట్‌మెంట్‌తో తనను అరెస్టు చేశారని, తాను ఎలాంటి ఆర్థిక ల‌బ్ది పొంద‌లేదని పేర్కొంటూ  ఈ వ్య‌వ‌హారంలో తాను బాధితురాలిని ఆమె తెలిపారు. రెండేళ్ల నుంచి కేసు విచార‌ణ ఎటు తేల‌డం లేదని, సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేష‌న్ క‌న్నా మీడియా విచార‌ణ ఎక్కువ‌గా జ‌రుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వ్య‌క్తిగ‌తంగా, రాజ‌కీయంగా తన ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చారని చెబుతూ నా మొబైల్ నంబ‌ర్‌ను అన్ని ఛాన‌ల్స్‌లో వేసి, నా ప్రైవ‌సీకి భంగం క‌లిగించారని క‌విత పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం చెప్పానని, ఇప్ప‌టికే నాలుగు సార్లు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యానని ఆమె చెప్పారు. బ్యాంకు వివ‌రాల‌తో పాటు ఇత‌ర బిజినెస్ వివ‌రాల‌ను కూడా ఇచ్చానని వెల్లడించారు. 
 
 గ‌త రెండున్న‌రేండ్ల నుంచి విచార‌ణ పేరుతో మాస‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇవాళ ఈడీ, సీబీఐ కేసుల‌ను ప‌రిశీలిస్తే.. ఒక 95 శాతం కేసులు ప్ర‌తిప‌క్ష పార్టీల‌పైనే ఉన్నాయని, బీజేపీలో చేరిన వెంట‌నే కేసుల విచార‌ణ ఆగిపోతుందని ఆమె గుర్తు చేసారు. 
 
పార్ల‌మెంట్ సాక్షిగా విప‌క్ష నేత‌ల‌ను ఉద్దేశించి నోరు మూసుకోక‌పోతే ఈడీని పంపుతామ‌ని బీజేపీ నేత‌ల‌న్నారని ఆమె చెప్పారు. ఈ కేసులో విచార‌ణ‌కు స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతూ తన కుమారుడి ప‌రీక్ష‌ల దృష్ట్యా బెయిల్ ఇవ్వాల‌ని మ‌ళ్లీ కోరారు. ఎందుకంటే తన కుమారుడి బోర్డు పరీక్షలపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డొద్ద‌నే ఉద్దేశంతో, ఈ స‌మ‌యంలో త‌న‌తో ఉండాలనుకొంటున్నట్లు తెలిపారు.