ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్‌ కేసులో ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)’ తనను అరెస్టు చేయడం అక్రమం అంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్‌ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది.

లిక్కర్‌ కేసులో అరెస్టయ్యి తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ తన అరెస్టును సవాల్‌ చేస్తూ గత వారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కేజ్రీవాల్‌ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజు వాదించారు. వాదనల తర్వాత తీర్పును రిజర్వు చేసిన ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆ తీర్పును వెలువరించింది.

ఈ సందర్భంగా లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్‌ స్కామ్‌కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదన కొరకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం తెలిపింది. కాబట్టి లిక్కర్‌ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం సబబేనని పేర్కొంది.

ఇడి అరెస్టును చట్ట విరుద్ధంగా పేర్కొనలేమని జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్‌ అరెస్టును చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా లేదని కోర్టు అభిప్రాయపడింది. రిమాండ్‌ను చట్టవిరుద్ధంగా పరిగణించలేమని జస్టిస్‌ శర్మ తీర్పు వెలువరించారు.  హవాలా డీలర్లు, ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాలు, గోవా ఎన్నికలలో ఖర్చు కోసం నగదు రూపంలో చెల్లించేలా చట్టాన్ని రూపొందించినట్లు సూచించిన స్వంత అభ్యర్థుల స్టేట్‌ మెంట్లుతో పాటు ఇడి అన్ని నివేదికలను అందుబాటులో ఉంచిందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకైనా, సీఎంకైనా చట్టం ఒకటేనని వ్యాఖ్యానించింది.  తన అరెస్టుతో పాటు ఇడి కస్టడీని కూడా కేజ్రీవాల్‌ ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. ఇడి తనను అరెస్టు చేసిన సమయాన్ని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ చర్య ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు, రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని కేజ్రీవాల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం వారంపాటు ఈడీ కస్టడీ విధించిన కోర్టు ఆ తర్వాత ఏప్రిల్‌ 15 దాకా జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ కీలక నేత మనీష్‌ సిసోడియా కూడా అరెస్టయ్యి జైలులో ఉన్నారు.