మార్గదర్శి డిపాజిట్లపై సమగ్ర విచారణ అవసరం

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమ డిపాజిట్ల కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిపాజిట్ల పై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కాలపరిమితి ద్వారా హైకోర్టుకు రిఫర్‌ చేస్తామని స్పష్టం చేసింది.
 
మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ”డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్‌ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి” అని తెలిపింది.
 
“ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్‌లోకి వెళ్ళడం లేదు. మేము హై కోర్టుకు రిఫర్‌ చేస్తాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి” అని ఆదేశించింది.
 
ఇదిలా ఉంటే, గత విచారణ సందర్భంగా మార్గదర్శి అక్రమాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తొలిసారి స్పందించింది. మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని కోర్టుకు ఆర్బీఐ తరఫు న్యాయవాది తెలిపారు. సెక్షన్‌ 45ఎస్‌కు వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధం అయినా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ నివేదించింది. 
 
మరోవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించిందని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. అదే సమయంలో.. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా? లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా? లేదా? అనేది ముఖ్యమన్న ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ బెంచ్‌ వద్ద ప్రస్తావించారు.