కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంలోనూ నిరాశ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్‌ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ‌ ఉదయం కొట్టేసింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్‌. 

లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి రెండు సార్లు అవకాశం ఇస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్ ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటీషన్ లో  కేజ్రీవాల్‌ కోరారు.

అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే తన అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్‌ అరెస్టును సమర్థించిన కోర్టు  సామాన్యులకు, సీఎంలకు న్యాయం ఒక్కోలా పనిచేయదంటూ వ్యాఖ్యానించింది.

మరోవంక, సుప్రీంకోర్టులో బుధవారం ఈడి అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్ధించటాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణ జరపాలని ఆయన న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. నిన్నటి ఢిల్లీ హైకోర్టు తీర్పుపై తాను వేసిన సవాల్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టక పోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది.

ఇక రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉండడంతో, వచ్చే సోమవారం వరకు ఆయన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం వచ్చే సోమవారం సెలవుల అనంతరం తెరవబడుతుంది. వచ్చే సోమవారం ఆయన పిటిషన్ సుప్రీం ధర్మాసనం ముందుకు వస్తుందని భావిస్తున్నారు. 
 
కేజ్రీవాల్ అత్యవసర అప్పీల్ కు ప్రాధాన్యత ఇవ్వని సుప్రీం అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ఎటువంటి ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేయలేదని తాజా పరిణామాలతో తెలుస్తుంది. సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ పండుగ కోసం గురువారం కోర్టుకు సెలవు ప్రకటించబడింది.