మే చివరిలో పీఎం కిసాన్ లబ్ధిదారులకు నిధులు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 17వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. అధికారిక సమాచారం ప్రకారం.. పీఎం -కిసాన్ పథకం 17వ విడత నిధులను మే చివరి వారంలో రైతుల ఖాతాలో వేయనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో 16వ విడత డబ్బులు విడుదల చేశారు. 

పీఎం- కిసాన్ కింద రూ. 21వేల కోట్లకు పైగా నిధులను 16వ విడత మొత్తాన్ని మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో జరిగిన సమావేశంలో లబ్ధిదారులకు మోదీ అందజేశారు. ఇప్పటివరకు 11 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు 3 లక్షల కోట్లకు పైగా నిధులు జమ అయ్యాయి. పీఎం- కిసాన్ పథకం కింద రైతులు ప్రతి సంవత్సరం రూ.6 వేలు పొందుతున్నారు. 

2019 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద, అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి రూ. 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6 వేలు అందిస్తారు. ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ మోడ్ ద్వారా అర్హత పొందిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ జరుగుతుంది.

ఈ పథకాన్ని మొదట 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ డబ్బులు అందుకోవడానికి రైతులు ఈ-కెవైసి పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పీఎం కిసాన్ డబ్బులను పొందటానికి ఈ-కెవైసి తప్పనిసరి. ఓటీపీ- ఆధారిత ఈకెవైసి పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకెవైసి కోసం సమీప సి ఎస్ సి కేంద్రాల్లో సంప్రదించవచ్చు.