తుక్కుగూడలో  దిక్కుమాలిన కాంగ్రెస్ మేనిఫెస్టో

తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభలో దిక్కుమాలిన మేనిఫెస్టో విడుదల చేశారని బిజెపి రాష్ట్ర అధికర ప్రతినిధి రాణి రుద్రమ ధ్వజమెత్తారు.   తనది కాకపోతే ఢిల్లీదాకా దేకమన్నరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ గతంలో 6 గ్యారంటీలు అంటూ మోసం చేసినట్లు.. మరోసారి 5 గ్యారంటీలు అంటూ ఊదరగొట్రిన్రు అంటూ ఆమె విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారిచ్చిన 6 గారెంటీలు ఎక్కడా కనిపించక అత్మలై తిరుగుతున్నాయని చెబుతూ రాహుల్ గాందీ చెప్పినట్టు కాంగ్రెస్ గ్యారెంటీ లు అత్మలే అని ఆమె స్పష్టం చేశారు.  కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాలు వరిధాన్యానికి రూ. 500 చొప్పున ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ కు సిగ్గుండాలని ఆమె ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే, కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిస్తే… తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలిస్తే ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇప్పుడిచ్చిన 5 గ్యారంటీలు అమలు చేస్తారట… అది అయ్యే పనేనా…? అంటూ రాణి రుద్రమ ఎద్దేవా చేశారు.

ప్రజాసమస్యలు పక్కదారి పట్టించి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నరని ఆమె దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల విషయంలో రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ఆమె సవాల్ చేశారు. డిటల్ ఇండియా, మేకిన్ ఇండియా ద్వారా  ఐటీ, పారిశ్రామిక రంగం, ట్రేడ్ సెక్టార్, మ్యానుఫాక్చరింగ్, హాస్పిటాలిటీ వంటి అనేక రంగాల్లో ఉపాధి కల్పన పెరిగిందని ఆమె స్పషటం చేశారు. అందుకే ప్రపంచంలోనే సుస్థిరమైన ఐదో దేశంగా భారత్ నిలిచిందని ఆమె తెలిపారు.

గత పదేళ్లలో ముద్ర లోన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మందికి రుణాలు అందించిందని, ప్రభుత్వ పథకాల ద్వారా లక్షా 20 వేల సంస్థలను పునరుద్ధరణ చేసి 46 లక్షల 89 వేల మందికి ఉపాధి కల్పన జరిగిందని ఆమె వివరించారు. ఏ సెక్టార్ లో ఎంత ఉపాధి కలిగిందో చర్చించేందుకు రేవంత్ రెడ్డి ముందుకు రావాలని రాణి రుద్రమ సవాల్ చేశారు.

అమెరికా, యూకే లాంటి దేశాల్లో పలు కంపెనీల్లో ఉద్యోగులను తొలగించిన సమయంలో.. భారత్ లో ఆత్మనిర్భర్ భారత్ పథకంతో చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద సంస్థల దాకా అందరికీ ఆర్థిక భద్రతనిచ్చి, వ్యాపారాలకు భరోసానిచ్చి ఉపాధి కల్పన కల్పించింది నరేంద్ర మోదీ ప్రభుత్వమని ఆమె తెలిపారు.
29 కోట్ల ప్రజలకు స్వయం ఉపాధికి ఉద్యోగాలు మోదీ కల్పించారని చెబుతూ ఇదంతా ఉపాధి కాదా? అని ఆమె ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల డబ్బులు వేరే వాటికి వాడుకొని కేంద్రం డబ్బులు ఇవ్వలేదని నిందలు మోపుతున్నారని ఆమె ఆరోపించారు. కేంద్రం హడ్కో నుండి రుణం తీసుకోకుండా ఒక్క ఇల్లు కట్టి చూపించమని రేవంత్ రెడ్డిని ఆమె నిలదీశారు. ఆర్టీసీ వాళ్లకు ఇంతవరకూ ఉచిత ప్రయాణం డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదని,
రైతు రుణమాఫీ గురించి ఇంతవరకు మాట్లాడటంలేదని ఆమె ధ్వజమెత్తారు.