ఫోన్ ట్యాపింగ్‌లో లైంగిక వేధింపులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఓవైపు రాజకీయ నేతలకు అవసరమైన ఫోన్లతో పాటు, మరోవైపు సొంత వ్యవహారాలకు కూడా ట్యాపింగ్‌ను అడ్డుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మహిళల ఫోన్లను ట్యాప్‌ చేసి వ్యక్తిగత సంభాషణలు విని లోబర్చుకునేవాడని సమాచారం. తాను కన్నేసిన మహిళలు, ఉద్యోగినులను వేధించాడని చెబుతున్నారు. 
 
నల్లగొండ జిల్లాలోని ఓ ఛోటా నాయకుడు అక్రమ వ్యవహారంలో పట్టుబడితే, దానిని అడ్డుపెట్టుకుని ఆయన భార్యను సైతం బ్లాక్‌మెయిల్‌ చేశాడు. సుమారు 40 మంది మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశాడని సమాచారం.
 
ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను వెస్ట్ జోన్‌ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో ఒకరు రౌడీ షీటర్లతో కలిసి సెటిల్‌మెంట్లు, గంజాయి కేసు నిందితులు, పేకాట నిర్వాహకులు, ఇతర నేరస్థులను టార్గెట్‌ చేసి రూ.కోట్లలో వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నర కిందట ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్లుగానూ గుర్తించారు.
 
నల్గొండ కేంద్రంగా సాగిన ఈ తంతుపై వెలుగులోకి వస్తున్న సమాచారం పోలీసు శాఖ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ట్యాపింగ్‌ కోసం నల్లగొండలోని హైదరాబాద్‌ రోడ్‌లోవార్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్లు నిర్ధారణ అయింది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలను యూనిట్‌గా ఏర్పాటు చేసుకుని నల్లగొండలోనే ట్యాపింగ్‌ సెంటర్‌ నిర్వహించారని, రెండు జిల్లాల ప్రతిపక్ష నాయకులు, వారి సన్నిహితుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివాదాస్పద కానిస్టేబుల్‌ మొత్తం తొమ్మిది సిమ్‌కార్డులను వినియోగించినట్లు సమాచారం.
ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎ్‌సడీ) రాధాకిషన్‌రావు వెస్ట్‌ జోన్‌ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ పెద్దల గుట్టును విప్పుతున్నట్లు సమాచారం. అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఇతర ఉన్నతాధికారులు చెప్పినట్లే చేశామని ఆయన ఒప్పుకోవడంతో కేసులో విస్తుపోయే అంశాలు బయటకొస్తున్నాయి.
మరోవైపు ట్యాపింగ్‌ ఇటీవల చేసింది కాదని, కొంతకాలంగా ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌లో కొందరు అధికారులు పథకం ప్రకారం ఈ కుట్ర పన్నారని ఇప్పటికే అరెస్టయిన అధికారులు విచారణలో చెప్పారు. ఇందులోభాగంగానే గత ప్రభుత్వ పెద్దలు ఒకే సామాజికవర్గానికి చెందిన ప్రభాకర్‌రావు, వేణుగోపాల్‌రావు, భుజంగరావు, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావుతో పాటు.. తిరుపతన్న, ఇంకొందరు ఇన్‌స్పెక్టర్లను ఇంటెలిజెన్స్‌, ఎస్‌ఐబీలోకి తెచ్చినట్లు తేలింది.