మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఆదివారం అర్ధరాత్రి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఓ భవనంలో రహస్యంగా సమావేశం పెట్టారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి ఉద్యోగులతో భేటీ అయిన భవనానికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఈ క్రమంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారని బిజెపి ఎంపి అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు. మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై మెదక్ బిజెపి ఎంపి అభ్యర్థి రఘునందన్‌రావు సీఈఓకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే మళ్లీ చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులతో వెంకటరామిరెడ్డి అక్రమంగా సమావేశం నిర్వహించడం సరికాదని హితువు పలికారు. వెంకటరామిరెడ్డి సమావేశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపణలు చేశారు. 
 
తన ఫిర్యాదుపై వెంకటరామిరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి అందరూ పారిపోయారని ఆరోపించారు. వెంకటరామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని పేర్కొంటూ బిఆర్‌ఎస్ నేతల తప్పుడు పనుల్లో ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ కు సహకరించి ఉద్యోగాలు కోల్పోవద్దని, న్యాయపరంగా తీసుకునే చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవద్దని రఘునందన్ సూచించారు.