అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరిన సీబీఐ

వైఎస్‌ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఇదే కేసులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ గురువారం కోరింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సీబీఐ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.

తన తండ్రిపై ఇటీవల అవినాష్‌ అనుచరులు దాడులకు పాల్పడ్డారని, జైలులో ఉండగా తనకు 20 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆశ చూపారని  హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్‌ దస్తగిరి తెలంగాణ హైకోర్టు లో వేసిన పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ మేరకు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  దానితో అవినాష్‌ ముందుస్తు బెయిల్‌ రద్దు అంశం గురువారం విచారణకు వచ్చింది.
 
ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి తరుపు న్యాయవాది  కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్, తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని గుర్తు చేశారు.
 
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని గత ఏడాది సీబీఐ అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాారు. అప్పట్లో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతులను ఉల్లంఘించి సాక్ష్యుల్ని ప్రభాావితం చేస్తున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. 
 
ఇదే క్రమంలో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టుకు తన అభిప్రాయం తెలిపింది. అవినాష్ రెడ్డితో పాటు వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారు అత్యంత ప్రభావ శీలురని, వారు ఇప్పటికే దస్తగిరితో పాటు సాక్ష్యుల్ని బెదిరిస్తున్నట్లు సీబీఐ తమ అఫిడవిట్ లో తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో సాక్ష్యుల్ని కాపాడాలంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. అయితే అవినాష్ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అప్పటికే వివేకా కుమార్తె సునీత సుప్రీంలో పిటిషన్ వేయడంతో అందులో తమ అభిప్రాయం చెప్పామని పేర్కొంది.