టిటిడి తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే మొట్ట‌మొద‌టిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను ప్రచురించింది. వచ్చే వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్నాయని ఆలయ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. టిటిడి సమాచార కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ ⁠ఏప్రిల్‌ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు. శ్రీ కోద్రి  నామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టిటిడి బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచామని చెప్పారు ధర్మారెడ్డి. ⁠ ⁠
 
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 5న తిరుమలలో శ్రీ అన్నమయ్య 521వ వర్థంతి కార్యక్రమం నిర్వహించున్నామని తెలిపారు. ఏప్రిల్‌ 21 నుండి 23వ తేది వరకు  తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ⁠ ⁠
 
ఇందులో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ⁠ ⁠ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు.
 
తిరుమల ఆలయానికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని  శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ⁠ఏప్రిల్‌ 22వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ⁠ ⁠

కాగా, 60 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలు పంపిణీ చేస్తుండగా, వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం దృష్ట్యా మరో 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు. మొత్తం 75 కౌంటర్ల ద్వారా లడ్డూలను త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.