పెన్షన్ల పంపిణీలో కొనసాగుతున్న రగడ

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీపై  రగడ కొనసాగుతోంది. ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్లు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వాఖ్యానించారు. 
 
పెన్షన్ల పంపిణీపై పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం హైకోర్టులో వివరణ ఇవ్వడంతో పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.  మరోవైపు వరుస సెలవుల తర్వాత బుధవారం నుంచి బ్యాంకుల్లో లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నుంచి సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లు మంగళవారం ప్రకటించినా సచివాలయాలకు నగదు చేరలేదు. 
 
మంగళవారం బ్యాంకులకు పని దినమైనా ప్రభుత్వం నుంచి ఖాతాలకు నగదు జమ కాకపోవడంతో అవి గ్రామ, వార్డు సచివాలయాలకు చేరలేదు. బుధవారం నుంచి పంపిణీ చేపట్టాలని గ్రామ వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే బ్యాంకుల నుంచి నగదు విత్‌ డ్రా చేసి వాటిని పంపిణీ మాత్రం బుధవారం ప్రారంభం కాలేదు.

బుధవారం ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకువచ్చి వాటిని లబ్దిదారులకు అందించే కార్యక్రమం సకాలంలో ప్రారంభం కాలేదు. ఉదయాన్నే పెన్షన్ల కోసం సచివాలయాల తలుపులు తెరవక ముందే లబ్దిదారులు చేరుకున్నారు. బ్యాంకుల నగదు రావాల్సి ఉందని చెప్పడంతో అక్కడే ఎదురు చూస్తున్నారు.  మరోవైపు ఇంటింటి పంపిణీ నిలిచిపోవడానికి టీడీపీ నేతల ఫిర్యాదులే కారణమని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగుల్ని మంచాలపై సచివాలయాలకు తరలించే ప్రయత్నం వైసిపి శ్రేణులు చేస్తున్నారు. కొన్ని చోట్ల నల్లజెండాలతో ర్యాలీగా సచివాలయాలకు వెళ్లారు.

 
టీడీపీ ఫిర్యాదులే దీనికి కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించాలని చెప్పినా రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రదర్శనలు, నిరసనలు చేపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు పెన్షన్ల కోసం సచివాలయాలకు వచ్చిన వారు ఎండ వేడితో అల్లాడిపోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి జమ చేశారు. రాష్ట్రంలోని 15వేలకు పైగా సచివాలయాల ఖాతాలకు ఈ నగదును జమ చేశారు. సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు నగదును విత్‌ డ్రా చేసి అయా సచివాలయ పరిధిలో పంపిణీ చేయాల్సి ఉంటుంది.