జ్వరంతో పవన్ కళ్యాణ్ ప్రచారంకు అంతరాయం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం సాయంత్రం తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. 
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. అయినా లెక్క చేయకుండా పవన్ వారాహి విజయ భేరి యాత్ర నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన మండుటెండలో ఏకంగా 20 కిలో మీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారని, రీ షెడ్యూల్చేసి పర్యటన పునః ప్రారంభిస్తారని ప్రకటించారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

” జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండు, మూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు” అంటూ జనసేన ట్వీట్ చేసింది.

పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ మొదటగా నాలుగు రోజులపాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం నియోజక వర్గంలోని యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఎండలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో జనసేనాని అస్వస్థతకు గురైనట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి.

అప్పటికే జ్వరంతో బాధపడుతున్న పవన్ ఎండలో తిరగటంతో మరింత అస్వస్థతకు లోనైనట్లు పేర్కొంటున్నాయి.  ప్రజానీకం సమస్యలు తెలుసుకునేందుకు జనం చెంతకు వెళ్లారు. మత్స్యకార గ్రామాల్లో మహిళలతో ముచ్చటించారు. ‘అన్నా మా ఇంటికి రా’ అని పిలిచిన ప్రతి ఇంటి గడప తొక్కారు.
 
మత్స్యకార గ్రామాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారులను పలుకరించారు. ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. మంగళవారం రోజంతా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలో సుమారు పదికి పైగా గ్రామాల్లో ఎర్రటి ఎండలో నడుస్తూనే పర్యటించారు. 
 
ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల ప్రాధాన్యాన్ని చూసి ప్రతి ఒక్కటీ పరిష్కారం అయ్యేలా సమష్టిగా కృషి చేద్దామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తూ కూటమి అభ్యర్ధిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.