33 ఏళ్ల మన్మోహన్ రాజ్యసభ ప్రస్థానానికి తెర

మాజీ ప్రధాని, ఎంపీ మన్మోహన్ సింగ్ (92) రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. మొత్తం ఆరు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సింగ్‌కు ఓ లేఖ రాశారు. మన్మోహన్ పదవీ విరమణతో ఒక శకం ముగిసిందని ఆయన పేర్కొన్నారు.

యువత దృష్టిలో ఆయన హీరోగా మిగిలిపోతారని చెప్పారు. ఎక్స్‌లో ఇందుకు సంబంధించి ఆయన సుదీర్ఘ పోస్ట్ చేశారు. “మీరు క్రియాశీల రాజకీయాల నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ, తరచూ దేశ పౌరులతో మాట్లాడటం ద్వారా జ్ఞానం పెంపొందించడంతోపాటు నైతిక దిక్సూచిగా నిలవాలని ఆశిస్తున్నా. దేవుడు ఎల్లప్పుడూ శాంతి, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. 

“మీరు దేశానికి చేసిన సేవల గురించి ప్రస్తుత నాయకులు చెప్పడానికి ఇష్టపడరు. కానీ దేశ ప్రజలు మీ సేవల్ని ఎన్నటికీ మర్చిపోరు. మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ మధ్యతరగతి యువతకు హీరో. పారిశ్రామికవేత్తలు, నాయకులకు మార్గదర్శకుడు. మీ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుంచి బయటపడగలిగిన వారెందరో ఉన్నారు” అని ఖర్గే తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

మన్మోహన్ సింగ్ సహా రాజ్యసభలో మొత్తంగా 54 మంది మంగళ, బుధవారాల్లో పదవీ విరమణ చేస్తున్నారు. అందులో 9 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్న ‘గా’ అనే ఊరిలో జన్మించారు. 1980 నుంచి 1982లో ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా, ఆ తర్వాత 1982లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పని చేశారు. అంతేకాదు 

ఐక్యరాజ్య సమితికి చెందిన కాన్ఫిరెన్స్ ఆఫ్ ట్రేడ్ డెవలప్‌మెంట్‌లో మెంబర్‌గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్‌కు 33 ఏళ్ల అనుబంధం ఉంది. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. 

అసోం నుంచి రాజ్యసభకు ఎన్నిక అవుతూ వస్తున్నారు. 2019లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడయ్యాక 1991 – 1996 మధ్య కాలంలో పీవీ నరసింహారావు హయాంలో ఆర్ధిక మంత్రి సేవలు అందించారు.

1971 – 1972 మధ్య విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా ఉంటూ, ఆ తర్వాత 1976 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా పదోన్నతి పొందారు, ఆ తర్వాతి సంవత్సరాలలోఆర్ బి ఐ డైరెక్టర్  (1976) -1980); ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి (1976 నుండి 1980 వరకు); ఆర్ బి ఐ గవర్నర్ (1982 నుండి 1985); డిప్యూటీ ఛైర్మన్, ప్రణాళికా సంఘం (1985 నుండి 1987), ఆర్థిక వ్యవహారాలపై ప్రధానమంత్రికి సలహాదారు (1990-1991)నిగా పనిచేశారు.
 
1991లో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన పివి నరసింహారావు తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు యుజిసి చైర్మన్ గా పనిచేస్తున్న ఆయనను జూన్ 21, 1991న ఆర్థిక మంత్రిగా ఆయనను తీసుకున్నారు. అప్పగించిన పనిని నిబద్దతతో నిర్వహించడం మినహా ఏనాడూ అప్పటి వరకు ఉదారవాద ఆర్ధిక విధానాల గురించి ఆయన మాట్లాడలేదు. మరోవంక, పివి నరసింహారావుకు సహితం ఆర్ధిక వ్యవహారాలపై అవగాహన లేదు.
 
అయితే, అప్పటికే దేశానికి ఉదారవాద ఆర్ధిక విధానాల అవసరాలను గుర్తించిన రాజీవ్ గాంధీ 1991 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో తాము అధికారంలో వస్తే వాటిని అమలు పరుస్తామంటూ ఓ పేజీలో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ బృందం సిద్ధం చేసిన అంశాల ఆధారంగా ఆర్ధిక వ్యవస్థను ఓ గాడిలో పెట్టె ప్రయత్నం చేశారు. ఈ విధానాలు అద్భుత ఫలితాలు ఇవ్వడంతో మధ్యతరగతి ప్రజలలో ఆయన విశేషంగా ప్రాచుర్యం పొందారు.
 
1998లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన సోనియా గాంధీ ఆయనను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నియమించారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన మే 22, 2004 నుండి మే 26, 2014 వరకు ప్రధానిగా కొనసాగారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాలలో, ముఖ్యంగా అమెరికాతో సంబంధాలను మెరుగు పరచడంలో గణనీయమైన ఫలితాలు సాధించారు.
 
ఓ మేధావిగా, నిబద్దత కలిగిన నేతగా ఆయన అంతర్జాతీయంగా కీర్తి పొందారు. కేవలం ఆయన వ్యక్తిత్వం కారణంగా అమెరికాతో అణు ఒప్పందం చేసుకో గలిగారు. తనపై వచ్చిన విమర్శల పట్ల స్పందించడం గాని, తాను సాధించిన విజయాల గురించి చెప్పుకోడవం గురించి గాని ఎప్పుడూ చేయరు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఓ ప్రధాన మంత్రి తన పనితీరు కారణంగా ఎన్నికలలో తన పార్టీకి విజయం చేకూర్చడం 2009లో మాత్రమే సాధ్యమైందని గమనించాలి.
 
చాల బలహీనుడైన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అమెరికాతో అణు ఒప్పందం విషయంలో  రాజీనామాకు సిద్దపడటం, అవిశ్వాస తీర్మానంకు సహితం వెనుకంజ వేయకపోవడం జాతీయ ప్రయోజనాల పట్ల ఆయన నిబద్ధతను వెల్లడి చేస్తుంది. భారత ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఎంతగానో దోహదపడిన సమాచార హక్కు చట్టం ఆయన హయాంలోనే కార్యరూపం దాల్చింది. అట్టడుగున ఉండే గిరిజన ప్రజల సాధికారికతకు ఎంతగానో తోడ్పడిన అటవీ హక్కుల చట్టం కూడా ఆయన ప్రభుత్వమే తీసుకొచ్చింది.
 
ఆయన జీవితంలో ఒకేసారి 2009లో ప్రత్యక్ష ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నుండి ప్రధానిగా పోటీచేశారు. అయితే బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రా చేతిలో ఓటమి చెందారు. రాజ్యసభలో మన్మోహన్ కు వీడ్కోలు పలుకుతూ ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.