ఏపీ రిజర్వుడ్‌ సీట్లలో ఎన్డీయే హవా

 
* ’పీపుల్స్‌పల్స్‌’ సర్వే ప్రకారం 36 సీట్లలో ఎన్డీయే 21, వైసిపి 15
 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కీలక భూమిక వహించే ఎస్సి, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల పట్ల ఇంకా ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారిస్తున్న సూచనలు కనిపించడం లేదు. గత ఎన్నికలలో 151 సీట్లతో వైసిపి అధికారంలోకి రావడంలో ఈ సీట్లలో సాధించిన సంచలనాల విజయాలు ప్రధాన కారణమయ్యాయి. అయితే ప్రస్తుత ఎన్నికలలో వీటిల్లో గాలి మార్పు స్పష్టంగా మారుతుంది.
 
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్నికల పరిశోధన సంస్థ ’పీపుల్స్‌పల్స్‌’ జరిపిన తాజా సర్వే ప్రకారం టిడిపి, జనసేన, బిజెపి కూటమి అత్యధిక సీట్లు గెల్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.  20 శాతానికి పైగా, అంటే 36 అసెంబ్లీ స్థానాలు ఏపీలో ఇలా రిజర్వు అయి ఉన్నాయి. షెడ్యూల్డ్‌ కులాలకు (ఎస్సీ) 29, షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)లకు 7 మొత్తం 36 అసెంబ్లీ స్థానాలు రిజర్వుడ్‌గా ఉన్నాయి
 
ఏపీలోని మొత్తం 29 ఎస్సీ స్థానాల్లో, తాజా సర్వే ప్రకారం వైసీపీకి 42.83 శాతం ఓటు షేర్‌ లభిస్తే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి 51.81 శాతం ఓటు షేర్‌ లభిస్తోంది. సీట్లు వైసీపీకి 10, కూటమికి 19 లభించవచ్చని జనాభిప్రాయంగా ఈ సర్వేలో వెల్లడయింది. 
 
ఎస్టీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ వైసీపీకి ఓటు షేర్‌ లో స్వల్ప ఆధిక్యత లభిస్తున్నా అది సీట్లకు వచ్చేసరికి తేడా అధికంగా ఉంది. 7 ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు వాటా 48.16 గాను, టీడీపీ-జనసేన-బీజేపీ( కూటమి ఓటు వాటా 46.49 గానూ నమోదయింది. అది వైసీపీకి 5 సీట్లు, కూటమికి 2 సీట్లుగా ప్రతిఫలిస్తోంది.
 
రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ సామాజిక వర్గాలను పెద్దగా ప్రభావితం చేసే పరిస్థితులు ఉండవు. కానీ, ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల ఇతర సామాజికవర్గాల వారు పోటీలో ఉన్న అభ్యర్థులను కాకుండా, ఏ పార్టీ మెజారిటీ స్థానాలు నెగ్గి అధికారంలోకి రాబోతోందో ఓ అంచనాతో ఉంటారు. అందుకే, ఫలితాలు ఇలా ట్రెండ్‌సెట్టర్స్‌లా వస్తుంటాయనే విశ్లేషణ కూడా ఒకటి ప్రచారంలో ఉందని పీపుల్స్‌పల్స్‌ పొలిటికల్‌ అనలిస్ట్  దిలీప్‌రెడ్డి తెలిపారు.
 
ఎస్టీ నియోజకవర్గాల్లో  తెలుగుదేశంతో సహా కూటమి పక్షాలు ఎప్పుడూ బలహీనంగానే ఉన్నాయి. ఇందులో టీడీపీ 2009లో ఒకసీటు గెలిస్తే, తాను అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లోనూ గెలిచింది ఒక సీటులోనే! ఇక 2019 ఎన్నికల్లో కనీసం ఒక స్థానం కూడా టీడీపీకి ఎస్టీ రిజర్వు స్థానాల్లో దక్కలేదు. జనసేన, బీజేపీలదీ దాదాపు అన్ని ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ మొత్తంగా తాను గెలిచిన 18 (ఆంధ్రలో 16, తెలంగాణ 2) స్థానాల్లోనూ ఎస్టీ సీటు లేదు.
 
పేరుకు రిజర్వు స్థానాలే అయినా ఈ నియోజకవర్గాలలో రెడ్డి (7స్థానాల్లో), కమ్మ (6), కాపు (6), ఇతర బలహీనవర్గాలు (8) ముఖ్య ప్రభావక సామాజికవర్గాలుగా ఉన్నాయి. రిజర్వు స్థానాలు కావడం వల్ల ఆయా వర్గాలవారే అభ్యర్థులుగా ఉంటున్నా, తుది ఫలితాన్ని ప్రభావితం చేయడంలో ఆయా వర్గాల పాత్ర అంతంతే!
 
వైసీపీ పరిస్థితి ఎస్టీ నియోజకవర్గాల్లో మెరుగ్గానే ఉన్నా, ఎస్సీ నియోజకవర్గాల్లో బాగో లేదని స్పష్టమౌతోంది. చదువుకున్న దళిత వర్గాల్లో ఇటీవల కొంత మార్పు కనిపిస్తోంది. సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపు, ఉద్యోగాలు దొరక్కపోవడం, రుణాలు సరిగ్గా లభించకపోవడం వంటివి వారి ఆలోచనల్లో మార్పుకు కారణం అయి ఉంటుందన్నది నిపుణుల అంచనా.
 
రాష్ట్రంలో విపక్ష ప్రధాన కూటమి వాటాల పంపకాల్లో భాగంగా జనసేనకుమూడు ఎస్సీ, ఒక ఎస్టీ సీటు దక్కగా, బీజేపీకి ఒక ఎస్సీ సీటు, ఒక ఎస్టీ సీటు లభించింది. ఇక మిగిలిన రిజర్వుడ్‌ స్థానాలంన్నిటా తెలుగుదేశం పార్టీయే పోటీ చేస్తోంది. గెలిచి, అధికారంలోకి వచ్చే పార్టీగా జనాభిప్రాయంలో ఉంటే పరిస్థితి సానుకూలించడం తప్పితే, పార్టీగా చూసినప్పుడు టీడీపీకి కూడా రిజర్వుడ్‌ స్థానాల్లో గొప్ప విజయాల చరిత్ర ఏమీ లేదు. జనసేన, బీజేపీ సంగతి సరేసరి! వైఎస్సార్‌సీపీ సంగతి నిలకడగా లేదు.