‘ఇండియా’ కూటమికి ముఫ్తీ షాక్‌

జమ్ముకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్‌ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప పీడీపీకి మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
 
తాము పోటీ చేస్తున్న మూడు స్థానాలలో పిడిపి పోటీచేయకపోవచ్చని ఎంసీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రకటించిన మరుసటి రోజునే ఆమె ఈ ప్రకటన చేయడం గమనార్హం. ముఫ్తీ నిర్ణయంపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ సొంత అభ్యర్థులను పోటీకి దించుతున్న ఆమె బహుశా ఎలాంటి పొత్తు కోరుకోవడం లేదని విమర్శించారు. మొత్తం 5 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటే అది ఆమె ఇష్టమని తెలిపారు. ముఫ్తీ ఫార్ములా ఆధారంగానే తాము కశ్మీర్‌లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. ‘ఇండియా’ కూటమి సీట్ల పంపిణీలో భాగంగా జమ్ములోని రెండు స్థానాలను కాంగ్రెస్‌కు వదిలిపెట్టినట్లు చెప్పారు. గత ఆదివారం జైలులో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ఇండియా కూటమి జరిపిన బహిరంగసభలో ఎంసీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లాతో కలిసి ముప్తి వేదిక పంచుకోవడంతో ఆమె సీట్ల సర్దుబాటుకు సుముఖంగా ఉన్నట్లు భావించారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాంటి పొత్తు అక్కర్లేదని మెహబూబా ముఫ్తీ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నదని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ‘మేం తలుపులు తెరిచి ఉంచాం. ఇప్పుడు ఆమె మూసి వేస్తే అది మా తప్పు కాదు’ అని మీడియాతో చెప్పారు. 

అయితే, కాశ్మీర్ లోయలో తమ పార్టీ ఉనికి అసలు లేనన్నట్లు ఎంసీ, కాంగ్రెస్ కలిసి సీట్లు పంచుకోవడం, తమతో మాటమాత్రంగానైనా చర్చలు జరపగా పోవడంతో ఆమె ఆగ్రహంతో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పిడిపి అన్ని సీట్లలో పోటీ చేస్తే కనీసం రెండు సీట్లలో ఎంసీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది.

జమ్ముకశ్మీరు మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారు. నారోగ్య కారణాలతోనే ఆయన పోటీచేయకూడదని నిర్ణయించుకున్నారని ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు.