ఆతిశీకి బీజేపీ పరువు నష్టం నోటీస్

ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీపై బీజేపీ పరువునష్టం నోటీస్ జారీ చేసింది. ప్రజలకు ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాలని, లేదంటే అరెస్ట్ తప్పదని ఓ బీజేపీ నేత తనను అడిగారని మంత్రి ఆతిశీ అరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో తనతోపాటు మరో ముగ్గురు ఆప్ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తారని ఆతిశీ ఆరోపించారు. 

ఈడీ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరాలని బీజేపీ నేత ఒకరు ఆశ్రయించినట్టు ఆమె పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ స్పందించింది. ఆతిశీని ఎవరు ఎప్పుడు ఎలా ఆశ్రయించారు? ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తగిన సాక్షాధారాలను ఆతిశీ ఇవ్వలేక పోయారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. 

ఢిల్లీలో ఆప్ సంక్షోభంలో కూరుకుపోయిందని, అందుకని నిరాశా నిస్పృహలతో ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా తాము విడిచిపెట్టేది లేదని చెప్పారు. తన ఆరోపణలను రుజువు చేసుకునేందుకు తన ఫోన్‌ను ఆమె దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సచ్‌దేవ్ సూచించారు.

బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… త్వరలో తన ఇల్లు, తన సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు చేపట్టబోతున్నదని, ఆ తర్వాత తనకు సమన్లు పంపించి అరెస్టు చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

 ‘నాకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా బీజేపీ నన్ను సంప్రదించింది. నా రాజకీయ జీవితం కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని, లేకపోతే నెల రోజుల్లో అరెస్టు అవుతావని చెప్పించింది. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, సత్యేందర్‌ జైన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆప్‌ విచ్ఛిన్నం అవుతుందని బీజేపీ ఆశించింది. కానీ అలా జరగకపోవడంతో తర్వాత కీలక నాయకులుగా ఉన్న నాతో పాటు సౌరభ్‌ భరద్వాజ్‌, రాఘవ్‌ చద్ధా, దుర్గేశ్‌ పాఠక్‌ను అరెస్టు చేయించబోతున్నది’ అని ఆమె ఆరోపణలు చేసారు.