అమేథిలో కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించింది

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో అమేథి నుంచి కాకుండా రాయ్‌బరేలి నుంచి పోటీకి దిగడంపై స్పందిస్తూ అమేథిలో గాంధీలు ఎవరూ ఎన్నికల బరిలో నిలవకపోవడం పోలింగ్‌కు ముందే ఇక్కడ ఓటమిని కాంగ్రెస్‌ అంగీకరించిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.

‘గాంధీ కుటుంబీకులు అమేథిలో పోటీ చేయకపోవడాన్ని బట్టి చూస్తుంటే పోలింగ్‌కు ముందే వారు ఓటమిని అంగీకరించారు. ఈ సీటుపై విజయం సాధించే అవకాశం ఉందని వారు భావించినట్లయితే వారే పోటీకి దిగేవారు. మరో అభ్యర్థిని నిలబెట్టేవాళ్లే కాదు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి వెళ్లిపోవడమంటే అది అమేథి ప్రజల విజయమే’ అని స్మృతి ఇరానీ తెలిపారు. 

మే 20న జరిగే ఎన్నికల్లో అమేథి నుంచి మళ్లీ తానే గెలుస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమేథి ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని చూశారని చెబుతూ మోదీ హయాంలో అభివృద్ధిని చూసిన అమేథి వాసులు.. గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి ఎందుకు జరగలేదని, ఆ కుటుంబం ఈ ప్రాంతానికి ఇంత నష్టం ఎందుకు చేసిందని అడుగుతున్నారని స్మృతి ఇరానీ తెలిపారు.

 ‘వయనాడ్‌లో పోలింగ్‌ తర్వాత రాహుల్‌ కొత్త సీటు కోసం చూస్తారని ప్రధాని ముందే ఊహించారు. అది ఈరోజు జరిగింది. మీరూ చూస్తున్నారు’ అని కేంద్ర మంత్రి చెప్పారు.  కాగా, అమేథి లోక్‌సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట అన్న విషయం తెలిసిందే. గతంలో సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఈ స్థానం నుంచి గెలుపొందారు. 

ఇక 2004లో రాహుల్‌ తొలిసారి అమేథి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా అమేథి నుంచే విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు.  ఆ ఎన్నికల్లో రాహుల్‌ అమేథితోపాటు కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ మాత్రం గెలుపొంది.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అమేథి లోక్‌సభ స్థానానికి స్మృతి ఇరానినే బీజేపీ బరిలోకి దింపింది.