బీజేపీలో చేర‌నున్న స్వ‌తంత్ర ఎంపీ సుమ‌ల‌త‌

మాండ్య నియోజ‌క‌వ‌ర్గ స్వ‌తంత్య్ర ఎంపీ, ప్రముఖ నటి సుమ‌ల‌త అంబ‌రీష్‌ తాను త్వ‌ర‌లో బీజేపీలో చేర‌నుట్లు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని, ఎన్డీయే, జేడీఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తానని కూడా ఆమె తెలిపారు. ఇక్కడి నుండి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేయనున్న జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి గత ఆదివారం ఆమెను కలిసి ఆమె మొద్దతు కోరారు.
 
జేడీఎస్ తో చేసుకున్న సీట్ల సర్దుబాట్ల కారణంగా ఈ సీటును జేడీఎస్ కు కేటాయించిన్నట్లు బిజెపి నేతలు కొద్దీ రోజులుగా ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను పోటీ చేయవద్దని కోరుతున్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారుల సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ తాను కేవలం పోటీ నుండి మాత్రమే తప్పుకొంటున్నానని,  మాండ్యాను తాను విడిచిపెట్ట‌డం లేద‌ని స్పష్టం చేశారు. 
 
 రాబోయే రోజుల్లో వారి కోసం తాను పనిచేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.  బీజేపీలో చేర‌డానికి నిర్ణయించుకున్నానని సుమ‌ల‌త ప్రకటించారు. కొందరు వ్యక్తులు తమకు ఎన్నికలలో సీట్లు దక్కకపోతే పార్టీలను విడిచి పోతూ ఉంటారని, తాను మాత్రం పోటీచేయకుండా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు.  
 
మాండ్యా ప్రజలు అందుబాటులో ఉండటం కోసమే బీజేపీ తనను బెంగళూరు, మైసూర్ తదితర ప్రాంతాలలో పోటీచేయమన్నా సుముఖత వ్యక్తం చేయలేదని ఆమె వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ పార్టీకి తనవంటి వారి అవసరం లేదని చెప్పారు. అయితే బిజెపి అన్ని అంశాలలో తనను విశ్వాసంలోకి తీసుకొంటూ వచ్చిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహితం ప్రజల మధ్య నుండి వచ్చే నాయకత్వం అవసరం అంటూ ఉంటారని తెలిపారు.

2019 నాటి ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌ద్ద‌తుతో కుమార‌స్వామి కుమారుడు నిఖిల్‌పై సుమ‌ల‌త స్వతంత్ర అభ్యర్థిగా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. 
అయితే, ప్రస్తుత ఎన్నికలలో జేడీఎస్ తో సీట్ల సర్దుబాటులో భాగంగా క‌ర్నాట‌క‌లో బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ది. జేడీఎస్ మూడు చోట్ల పోటీ చేస్తుంది. ఈసారి మాండ్య నుంచి జేడీఎస్ పోటీలో నిల‌బ‌డ‌నున్న‌ది. తాను స్వతంత్య్ర ఎంపీగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మాండ్య లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికిర 4,000 వేల కోట్ల నిధుల్ని విడుదల చేయించినట్లు సుమ‌ల‌త వెల్ల‌డించారు. బీజేపీ నుంచి రాజ్య‌స‌భ‌కు సుమల‌త వెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.