కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు .. అందులో ఐదు అధికార కేంద్రాలు

క్రమశిక్షణా రాహిత్యం, పార్టీ వ్యతిరేక ప్రకటనల కారణంగా పార్టీ నుండి ఆరేళ్ల పాటు బహిష్కరణకు గురైన మరుసటి రోజు ముంబై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ గురువారం పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర దాడిని ప్రారంభించారు. కాంగ్రెస్ లోని  “పాత” నాయకులు క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధాలు కొలిపోయారని, పార్టీకి భవిష్యత్ లేదని, అందులో ఐదు అధికార కేంద్రాలు ఉన్నాయని అంటూ విమర్శలు గుప్పించారు. 
 
మహారాష్ట్రాలో మూడు పార్టీల మహా వికాస్ అఘాడి (ఎంవిఏ) “మూడు నష్టాల కంపెనీల వెంచర్” అని, అది విఫలమవుతుందని అంటూ ఎద్దేవా చేశారు.   “కాంగ్రెస్ సంస్థాగతంగా చెదిరిన పార్టీ. సైద్ధాంతికంగా పార్టీ గందరగోళంగా ఉన్నట్లు ఇప్పటికే చాలామంది ఎత్తి చూపారు. నేడు కాంగ్రెస్‌లో వివిధ లాబీలతో ఐదు అధికార కేంద్రాలు ఉన్నాయి. ఏ లాబీకి చెందని నాలాంటి వ్యక్తులు బాధపడుతున్నారు” అంటూ ఆవేదన వక్తం చేశారు.
 
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లను ఐదు అధికార కేంద్రాలుగా అభివర్ణించారు. దీంతో ప్రతిభావంతులైన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. “నేను చాలాకాలం ఓపిక పట్టాను. కానీ ఎట్టకేలకు ముగిసింది” అని నిరుపమ్ తెలిపారు.
 
“70 ఏళ్ల తర్వాత, మతాన్ని అంగీకరించని కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నెహ్రూవియన్ లౌకికవాదం ముగిసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రభావంలో ఉంది. రాహుల్ గాంధీని వామపక్షాలు చుట్టుముట్టాయి. ఈ వామపక్షాలు అయోధ్యలో రాముడిని వ్యతిరేకిస్తున్నాయి. అయోధ్యకు ఆహ్వానం అందిన తర్వాత రాముడి ఉనికిపై అనుమానాలు లేవనెత్తింది కాంగ్రెస్ మాత్రమే. ఇది కాంగ్రెస్‌పై కమ్యూనిస్టు ప్రభావం” అని ‘జై శ్రీరామ్’తో విలేకరుల సమావేశాన్ని ప్రారంభించిన నిరుపమ్ పార్టీపై విరుచుకు పడ్డారు.
 
ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తనకు పార్టీ టికెట్ నిరాకరించడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ నాకు టికెట్ ఇస్తే, నేను లేవనెత్తిన సమస్యలను వినడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లాయెడిది” అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి బీహార్‌కు చెందిన నిరుపమ్, 1993లో శివసేన హిందీ అధికార పత్రిక దోపహార్ కా సామ్నాలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 
 
శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ థాకరే రాజ్యసభలో పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఆయనను ఎంచుకున్నారు. 1996లో మొదటి సారి,  2000లో రెండోసారి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. ఉద్ధవ్ థాకరేతో విభేదాల కారణంగా, నిరుపమ్ మార్చి 2005లో శివసేనకు రాజీనామా చేసి, ఒక నెల తర్వాత ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లో చేరారు. 
 
కాంగ్రెస్ 2009లో ముంబై నార్త్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యద్రదిగా నిరుపమ్‌  లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, 2014, 2019లలో వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు.