నవనీత్‌కౌర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

తప్పుడు కులధ్రువీకరణ పత్రాల కేసులో నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం గురువారం రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కౌల్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 
 
ఎన్నికల్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు నిర్దారించిన బాంబే హైకోర్టు ఆమెకు రూ.2 లక్షలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆరువారాల్లోగా ఆ సర్టిఫికెట్‌ను సరెండర్ చేయాలని ఆదేశించింది. నవనీత్‌కౌర్ ఎస్సీ కాదని, ఫోర్జరీ ధ్రువీకరణ పత్రంతో ఆమె పోటీ చేశారని ఆరోపిస్తూ ప్రత్యర్ధి మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అద్సూల్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
దీనిపై విచారించిన న్యాయస్థానం  2021 జూన్‌లో తీర్పు వెలువరించింది. దీనిని నవనీత్ కౌర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ‘స్క్రూటినీ కమిటీ తన ముందున్న పత్రాలను సక్రమంగా పరిశీలించి, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా తన నిర్ణయాన్ని ఆమోదించింది. ఇది ఆర్టికల్ 226 ప్రకారం ఎటువంటి జోక్యానికి అర్హమైంది కాదు. వాస్తవాలు, పరిస్థితుల దృష్ట్యా, తక్షణ అప్పీళ్లకు అనుమతి ఉంది. హైకోర్టు ఆర్డర్ పక్కన పెడుతున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 
 
2019 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేసిన నవనీత్ కౌర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్ ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈసారి ఆమెకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో నవనీత్ కౌర్ భారతీయ జనతా పార్టీలో చేరారు.