విస్తారాలో పైలట్ల సంక్షోభం- 70కి పైగా విమానాలు రద్దు!

సోమవారం నుంచి కొనసాగుతున్న విస్తారా ఎయిర్​లైన్స్​ పైలట్​ సంక్షోభం మంగళవారం మరింత తీవ్రమైంది. పైలట్​లు మూకుమ్మడిగా సిక్​ లీవ్​ పెట్టడంతో అనేక విమానాలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ సోమవారం 70కు పైగా రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను రద్దు చేశారు. ఇందులో ముంబై నుంచి టేక్ఆఫ్‌ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి. కాగా, సోమవారం 50 విమానాలను రద్దవగా, మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
విమానాల రద్దు, ఆలస్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విస్తారా విమానాల కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని, సరైన సమాచారం ఉండటం లేదని పలువురు ప్రయాణికులు విమర్శించారు. దీనిపై విస్తారా సంస్థ స్పందిస్తూ.. తమ వినియోగదారులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెప్పింది.
 
గతకొన్ని రోజులుగా తాము పైలట్ల  కొరతతోపాటు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొంది. టాటా గ్రూప్​నకు చెందిన ఈ విస్తారా ఎయిర్​లైన్స్​ ఎయిర్ ఇండియాలో విలీనం అవ్వనుంది. మరికొన్ని రోజుల్లో ఈ ‘విలీనం​’ అమల్లోకి వస్తుంది. ఈ తరుణంలో పైలట్​ల జీతాల విషయంలో కొత్త నిబంధనలు తీసుకు రావడంతో తాజా సంక్షోభం తలెత్తింది.

“కొత్త పే స్ట్రక్చర్​పై సంతకాలు చేయని పైలట్​లకు అప్​గ్రేడ్​ సీక్వెన్స్​ లిస్ట్​లో స్లాట్​ ఉండదు. పైలట్​లకు హామీనిచ్చిన 1 టైమ్​ బోనస్​ని కూడా ఇవ్వము. సంతకం చేయని పైలట్​లకు ఎయిర్​ ఇండియాతో పనిచేసేందుకు ఇష్టం లేదని మేము భావిస్తాము. ఎయిర్​ ఇండియా విలీన ప్రక్రియలో వారిని కలుపుకోము,” అని పైలట్​లకు ఈ-మెయిల్​ పంపించింది విస్తారా ఎయిర్​లైన్స్​.

ఈ మెయిల్​ అందిన తర్వాత చాలా మంది పైలట్​లు గత రెండు రోజులుగా మూకుమ్మడి సిక్​ లీవ్​లు పెట్టేశారు. ఎక్స్​టెండెడ్​ డ్యూటీ విషయంలోనూ వారు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా విమాన సేవలకు తీవ్ర ఆటంకం ఎదురైంది. విస్తారా పైలట్ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటన చేసింది సంస్థ. కానీ ఇప్పటివరకు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

విస్తారా పైలట్​ సంక్షోభంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ పూర్తి వ్యవహారంపై నివేదిక అందించాలని విస్తారాకు విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. ఇలాంటి సంక్షోభం సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా స్పష్టంగా చెప్పాలని కోరింది. విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికలు ఇవ్వమని కోరిన డిజిసిఏ ప్రయాణికుల ఇబ్బందుల గురించిన పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.