ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్‌కు బెయిల్ మంజూరీ

ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసులో అరెస్టు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్‌కు బెయిల్ మంజూరీ అయ్యింది. ఆర్నెళ్ల త‌ర్వాత ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చారు. ఎక్సైజ్ కేసుతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఎంపీ సంజ‌య్ సింగ్‌ను విడుదల చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది.
జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్త‌, ప్ర‌స‌న్న బీ వ‌రాలేతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. ఎంపీ సంజ‌య్ సింగ్ క‌స్ట‌డీ అవ‌స‌రం లేద‌ని ఈడీ చెప్ప‌డంతో కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.  ట్రయల్ కోర్టు నిర్ణయించిన షరతులపై సంజయ్ సింగ్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
ఆయన వద్ద ఎలాంటి నగదు లభించనప్పటికీ ఆరు నెలలుగా జైళ్లో ఎలా ఉంచుతారని కోర్టు ఈడీని ప్రశ్నించింది. ఎంపీ సంజ‌య్ సింగ్ క‌స్ట‌డీ అవ‌స‌ర‌మా లేదా అని లంచ్ బ్రేక్‌కు ముందు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్వీ రాజును కోర్టు అడిగింది.  అయితే భోజ‌న విరామం త‌ర్వాత ఆయ‌న కోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌ద్యం కేసులో సంజ‌య్ సింగ్ అవ‌స‌రమే ఉన్నా ఆయ‌న క‌స్ట‌డీ అవ‌స‌రం లేద‌ని, ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వ‌వ‌చ్చు అని కోర్టుకు ఈడీ చెప్పింది. మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 45 ప్ర‌కారం బెయిల్ మంజూరీ చేశారు.
 
ఆయనకు బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థాన ఎటువంటి షరతులు విధించలేదు. సంజయ్ సింగ్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై అక్టోబరులో సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. 
 
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోరాతో సంజయ్‌కు పరిచయాలు ఉన్నట్టు గుర్తించిన ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది.  ఎక్సైజ్ డ్యూటీ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారనేది ఈడీ ఆరోపణ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్  జనవరిలో జైలు నుంచి నేరుగా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేసి గెలుపొందారు. 
 
వ్యక్తిగతంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి అండర్‌టేకింగ్‌లు, నామినేషన్ ఫారాలు, ఇతర ఆధారాలపై సంతకం చేయడానికి అనుమతించాలని జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. జనవరి 27తో ఆయన పదవీకాలం ముగియగా.. ఆప్ ఆయనను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది.