మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు కష్టాలు తప్పడం లేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆమెపై కేసు నమోదు చేసింది. పార్లమెంట్‌లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువా మొయిత్రాపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ సూచన మేరకు పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారని ఆమెపై ఆరోపణలున్నాయి. 
 
బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఫిర్యాదు చేయగా సాక్ష్యాన్ని న్యాయవాది జై అనంత్‌ దేహద్రాయ్‌ అందజేశారు. లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో నిషికాంత్‌ దూబే న్యాయవాది, జై అనంత్‌ నుంచి లేఖ అందించినట్లు తెలిపారు. పార్లమెంటులో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 దర్శన్‌ హీరానందానీ, అతని కంపెనీ వ్యాపార ప్రయోజనాలు కాపాడేవేనని తేల్చారు. 
 
ఈ విషయంలో లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఈడీ సైతం మహువా వాంగ్మూలాన్ని నమోదు చేసిందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే సీబీఐ కూడా ఈ కేసును విచారిస్తోంది. అదే సమయంలో లోక్‌పాల్ సైతం ప్రాథమిక విచారణ చేపట్టింది.
 
 సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కేసులో మార్చి 28న ఢిల్లీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇటీవల ఇచ్చిన సమన్లను మహువా మొయిత్రా బేఖాతరు చేసిన నేపథ్యంలో ఈడీ తాజా చర్యకు దిగింది. ‘ఫెమా’ చట్టా్న్ని ఉల్లంఘించారనే కారణంగా ఆమెతో పాటు వ్యాపారవేత్త దర్శన్ హిరానందానికి ఈడీ సమన్లు జారీచేసింది.