భారత్‌లోకి అక్రమంగా చైనా వెల్లుల్లి!

మన దేశంతో సరిహద్దుల్లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాతో వాణిజ్య ఒప్పందాలను తగ్గించి  వస్తువుల కోసం ఆ దేశం మీద ఆధారపడకుండా భారత్‌ దిగుమతులను తగ్గించుకుంది. ఈ క్రమంలోనే గతంలోనే చైనా నుంచి వచ్చే వెల్లుల్లి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా అక్రమంగా చైనా వెల్లుల్లి భారత్‌లోకి ప్రవేశిస్తోంది. దీనిపై నిఘా పెట్టిన అధికారులు అప్రమత్తమయ్యారు.

చైనా నుంచి నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చైనా వెల్లుల్లి విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే దేశంలో భారీగా చైనా వెల్లుల్లి నిల్వలు వెలుగుచూడటంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. 

 
చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి, స్నిఫర్ డాగ్స్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చైనా వెల్లుల్లి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం 2014 లోనే నిషేధం విధించింది. ఫంగస్ సోకిన వెల్లుల్లిని భారత్‌కు తరలిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చైనా వెల్లుల్లి దిగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అక్రమ మార్గాల్లో దేశంలోని డ్రాగన్ వెల్లుల్లి చేరుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. 
 
ఇలా అక్రమంగా దేశంలోకి వచ్చిన చైనా వెల్లుల్లిలో అధిక మోతాదులో పురుగుమందులు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల సిక్తా ల్యాండ్ కస్టమ్స్‌ చెక్‌పోస్ట్ వద్ద 64 వేల కిలోల చైనా వెల్లుల్లిని అధికారులు సీజ్ చేయడంతో ఈ అక్రమ రవాణా వెలులోకి వచ్చింది. దీని విలువ రూ.1.35 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.
 
మన దేశంలో వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో చైనా వెల్లుల్లి అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. భారత్‌లో 1000 నుంచి 1200 టన్నుల చైనా వెల్లుల్లి నిల్వలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. గతేడాది నవంబర్ నుంచి వెల్లుల్లి ధరలు మన దేశంలో రెట్టింపు అయ్యి కిలోకు రూ.450 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే చైనా వెల్లుల్లి మార్కెట్‌లోకి భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రభుత్వ వర్గాలు జోక్యం చేసుకున్నాయి. ప్రపంచంలోనే వెల్లుల్లి ఎగుమతుల్లో భారత్, చైనా అగ్రదేశాలుగా ఉన్నాయి. కరోనా మహమ్మారి తర్వాత భారత వెల్లుల్లికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. మరీ ముఖ్యంగా అమెరికా, పశ్చిమ ఆసియా, బ్రెజిల్, ఆసియా దేశాలకు భారత్ నుంచే వెల్లుల్లి ఎగుమతి అవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.246 కోట్ల విలువైన 57,346 టన్నుల వెల్లుల్లిని భారత్ ఎగుమతి చేసింది.