ఐదు ఎన్జీఓలకు ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ రద్దు

  విదేశీ విరాళాల స్వీకరణచట్టాలను ఉల్లంఘించారనే కారణంగా ఐదు స్వచ్ఛంద సంస్థలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కన్నెర్ర చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద వారి లైసెన్సులను రద్దు చేసింది.  తమ ఆదేశాలకు అనుగుణంగా ఆ  సంస్థలు నిధులను వినియోగించడం లేదన్న ఆరోపణలతో హోం శాఖ ఈ చర్య తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
 
వీటిలో చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా ( సిఎన్‌ఐ -ఎస్ బి ఎస్ ఎస్) కూడా ఉంది. ఫారిన్ ఫండింగ్ లైసెన్సులను రద్ద చేసిన ఇతర ఎన్జీవోల్లో వాలంటరీ హెల్త్ అసోసిసియేషన్ ఆఫ్ ఇండియా (వీహెచ్‌ఏఐ), ఇండో-గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ (ఐజీఎస్ఎస్ఎస్), చర్చ్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్ (సీఏఎస్ఏ-కాసా), ఎవేంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఓఐ) ఉన్నట్టు ఎంహెచ్ఓ వర్గాలు తెలిపాయి.
 
 విదేశీ విరాళాల స్వీకరణ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యల విషయంలో ఎంహెచ్ఏ పట్టుదలగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్) లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. 2020 నుంచి ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలకు కేంద్రం కఠినతరం చేసింది. 
 
పలు సమరణలు చేస్తూ, ఎన్జీవోల లైసెన్సుల రద్దు చేసే విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తోంది. గత కొన్నేళ్లుగా చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ), సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్) సహా పలు ఎన్జీవోల లైసెన్సులను రద్దు చేసింది.

ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో ఆ ఎన్‌జిఒలు విదేశాల నుండి నిధులను స్వీకరించలేవు, అందుబాటులో ఉన్న నిధులను కూడా వినియోగించుకునేందుకు అవకాశం ఉండదు. గత ఐదేళ్లలో కేంద్రం సుమారు 6,600 ఎన్‌జిఒలకు విదేశాల నుండి నిధులు అందకుండా ఎఫ్‌సిఆర్‌ఎను రద్దు చేశారు. పదేళ్లలో ఈ సంఖ్య 20,693గా ఉంది.