ఈ ఏప్రిల్ నుంచి దేశంలో పలు రకాల మందుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఇటీవల చాలా రకాల మీడియాల్లో వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. మందుల పెరుగుదలపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలనీ స్పష్టం చేసింది. మందుల ధరలు పెరుగుతున్నాయని చెప్పిన మీడియా నివేదికలు తప్పుదోవ పట్టించేవని, హానికరమైనవిగా బుధవారం తేల్చి చెప్పింది.
ఇటీవల వచ్చిన కొన్ని మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ నుంచి దేశంలో ఔషధాల ధరలు ఏకంగా 12 శాతం చొప్పున పెరుగుతాయని తెలిసింది. దాదాపు 500 కంటే ఎక్కువ రకాల మందుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. అయితే ఆ ప్రచారం అంతా ఉత్తదే అని కేంద్రం కొట్టిపారేసింది. టోకు ధరల సూచి ఆధారంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ- ఎన్‌పీపీఎ ఏటా షెడ్యూల్ చేసిన కొన్ని మందుల సీలింగ్ ధరలను సవరిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.
టోకు ధరల సూచీలో పెరుగుదల 0.00551 శాతం ఆధారంగా 782 మందుల కోసం ప్రస్తుత సీలింగ్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అదే సమయంలో 54 మందులపై కేవలం ఒక పైసా మాత్రమే అతి తక్కువ పెరుగుదల ఉంటుందని తెలిపింది. అయితే ఈ 54 రకాల మందుల సీలింగ్ ధర రూ. 90 నుంచి రూ. 261 వరకు ఉంటుందని వెల్లడించింది.
డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్స్-డీపీసీఓ 2013 నిబంధనల ప్రకారం టోకు ధరల సూచీ పెంపు అనేది అనుమతించదగినదని కేంద్రం తెలిపింది. అలాంటి సమయంలో సదరు ఔషధాల తయారీ సంస్థలు ఆ టోకు ధరల సూచీ ఆధారంగా మందుల ధరలను పెంచవచ్చు.. పెంచకపోవచ్చు అంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
అందువల్ల ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో టోకు ధరల సూచీ ఆధారంగా ఔషధాల సీలింగ్ ధరలో దాదాపు ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది. తమ ఔషధాల సీలింగ్ ధరపై ఆధారపడి కంపెనీలు జీఎస్టీని మినహాయించి, ఎమ్‌ఆర్‌పీ సీలింగ్ ధర కంటే తక్కువ ధరగా మార్చవచ్చని కేంద్రం పేర్కొంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.
అయితే ఆ ధరల వివరాలు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ- ఎన్‌పీపీఎ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ధరలు 2025 మార్చి 31 వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించింది.

More Stories
రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
పంజాబ్ సీఎం మాన్ క్యాంపు కార్యాలయంలో సీబీఐ సోదాలు
జిడిపి 6.6 శాతం నుంచి 7.1 శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు