నీట్-యూజీ 2026 లీక్..రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు విక్రయం

నీట్-యూజీ 2026 లీక్..రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు విక్రయం
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రసాయన శాస్త్రానికి (కెమిస్ట్రీ) సంబంధించిన 111 ప్రశ్నలను కేవలం రూ.5 లక్షలకే విక్రయించినట్లు సీబీఐ తెలిపింది.  ఈ కేసులో ఇప్పటికే మోటెగావ్‌కర్‌ను అరెస్టు చేసిన సీబీఐ, అతని బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
 
ఈ కేసులో ప్రధాన నిందితుడు, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో కీలక ఆధారాలను ఉంచింది.  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీలో సభ్యుడిగా పనిచేసిన పీవీ కులకర్ణి నుంచి మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన శివరాజ్ ఈ ప్రశ్నలను సేకరించినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. 
 
శివరాజ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో 36 ఫొటోలు లభించాయి.  చేతితో రాసిన 132 రసాయన శాస్త్ర ప్రశ్నలు ఈ ఫొటోల్లో ఉండగా, వాటిలో 111 ప్రశ్నలు అసలైన నీట్-యూజీ 2026 మాస్టర్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో పూర్తిగా సరిపోలాయి.  ఆ నోట్స్‌ను నిందితుడే స్వయంగా రాసినట్లు ప్రాథమికంగా తేలింది. 
 
ఈ ప్రశ్నల ఫొటోలను మే 3న జరిగిన పరీక్షకు పది రోజుల ముందే సేకరించినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది.   లాతూర్‌కు చెందిన డాక్టర్ మనోజ్ శిరూరే, మాజీ ఎన్‌టీఏ ప్యానెల్ సభ్యుడు, రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణి ద్వారా ఈ ప్రశ్నలు మోటెగావ్‌కర్‌కు చేరినట్లు సీబీఐ తెలిపింది. ఇందుకోసం రూ.5 లక్షలు చెల్లించినట్లు కూడా ఆరోపించింది.
అలాగే, లీకైన ప్రశ్నపత్రం పీడీఎఫ్ కాపీలను టెలిగ్రామ్ ద్వారా రూ.10 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షకు కొన్ని వారాల ముందే 410 ప్రశ్నలతో కూడిన 150 పేజీల ‘అంచనా ప్రశ్నపత్రం’ను కొంతమంది అభ్యర్థులకు అందించినట్లు సీబీఐ తెలిపింది. అందులోని సుమారు 120 ప్రశ్నలు నీట్-యూజీ 2026 కెమిస్ట్రీ ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పరీక్షకు ముందే ప్రశ్నపత్రంలోని కీలక ప్రశ్నలు కొందరి చేతికి చేరినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది.

ఈ భారీ పేపర్ లీక్ కుంభకోణంలో ఇప్పటివరకు సీబీఐ 13 మందిని అరెస్టు చేసింది. వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో మొదట మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసిన కేంద్రం, అనంతరం జూన్ 21న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్షను నిర్వహించింది.