బెంగళూరు ఫైవ్ స్టార్ హోటళ్ల కిచెన్‌లో కుళ్లిన కూరగాయలు, మాంసం

బెంగళూరు ఫైవ్ స్టార్ హోటళ్ల కిచెన్‌లో కుళ్లిన కూరగాయలు, మాంసం
కర్ణాటక రాజధాని బెంగళూరులోని లగ్జరీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా హోటళ్లలో కుళ్లిన కూరగాయలు, మాంసం, ఎక్స్‌పైరీ అయిన పాలు, ఫంగస్ సోకిన ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి. పలు హోటళల్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఏమీ పాటించడం లేదని వెల్లడైంది. కర్ణాటకకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన అధికారులు బెంగళూరు అర్బన్ జిల్లాలోని అనేక స్టార్ హోటళ్లలో తాజాగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు  నిర్వహించారు. 

30 బృందాలు ఇందుకోసం పని చేస్తున్నాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడించారు. తాజ్ యెశ్వంత్‌పూర్, షాంగ్రి లా బెంగళూరు వంటి ప్రముఖ త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 26 హోటళ్లను తనిఖీ చేయగా, అనేక చోట్ల తీవ్రమైన ఉల్లంఘనలు కనిపించాయి. సాధారణంగా స్టార్ హెటల్స్ అనగానే ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తారని అనుకుంటారు.                                                                           

కానీ, ఇక్కడ చాలా చోట్ల కనీస ప్రమాణాలు పాటించట్లేదని, పాడైన, ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయిన కూరగాయలు, మాంసం, పాలు, ఇతర తయారు చేసిన పదార్థాలనే వాడుతున్నట్లు తేలింది. ఈ హోటళ్ల నుంచి చికెన్, మటన్, చేపమాంసం, ఆయిల్, పాలు, మసాలాలు, టీ పౌడర్, చీజ్, సాసెస్ వంటి అనేక పదార్థాల శాంపిల్స్ సేకరించి, వాటిని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు.  అనేక హోటళ్లలో కిచెన్‌లో పారిశుధ్యం లోపించినట్లు గుర్తించారు.

అలాగే, కుళ్లిన కూరగాయల్ని వాడుతున్నారు. ఎప్పుడో తయారు చేసిన ఆహార పదార్థాలు పాడైనప్పటికీ వాటిని మళ్లీ వినియోగిస్తున్నారు. కొన్నింటికి ఫంగస్ సోకి ఉంది. ఆహార పదార్థాల నిర్వహణ, భద్రత కూడా సరిగ్గా లేదు. కొన్ని పదార్థాలపై తప్పుడు లేబుల్స్ ఉన్నాయి. అలాగే, శాకాహార, మాంసాహారాన్ని ఒకే చోట కలిపి ఉంచారు. నిబంధనలకు ఇది విరుద్ధం. వెజ్, నాన్‌వెజ్ ఐటమ్స్ వేర్వేరుగా ఉంచాలి.

లిత్ అశోక్ హోటల్ నుంచి 76 కేజీల మాంసం, 200 కేజీల కూరగాయలు, 32 లీటర్ల పాలు పాడైనట్లు గుర్తించి, వాటిని నాశనం చేశారు.  వివాంటా బెంగళూరు, షాంగ్రి లా బెంగళూరు, తాజ్ యెశ్వంత్‌పూర్ వంటి ప్రముఖ హోటళ్లలో కూడా కుళ్లిన మాంసం, కూరగాయలు, పాలు, బేకరి ఐటమ్స్ గుర్తించి ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈ హోటళ్లు అన్నింటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.