ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్ర చట్టం సవరణ (ఎఫ్‌సీఆర్ఏ) బిల్లు 2026పై అమెరికా చట్టసభ సభ్యుడు రైలీ మూర్ చేసిన విమర్శలకు భారత్ దీటుగా బదులిచ్చింది. ఇది తమ అంతర్గత విషయమని, అమెరికన్లు కూడా తమ దేశంలోకి ప్రవహించే విదేశీ నిధులను నియంత్రిస్తారనే విషయం గుర్తించుకోవాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
“ ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై వచ్చిన వ్యాఖ్యలను మేము గమనించాం. భారతదేశానికి సంబంధించిన శాసనపరమైన వ్యవహారాలు మా అంతర్గత విషయాలు. వీటిపై దేశ పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించే చట్టాలు అమెరికా సహా అనేక ఇతర దేశాల్లో కూడా అమలులో ఉన్నాయని నేను ఇక్కడ గుర్తుచేయాలనుకుంటున్నాను’’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
ప్రతిపాదిత
ఎఫ్‌సీఆర్ఏ బిల్లు, 2026పై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ నుంచి ఈ స్పందన వచ్చింది. ఆ బిల్లులోని కొన్ని నిబంధనలు చర్చిలను, మతపరమైన స్వచ్ఛంద సంస్థలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి అనుమతించవచ్చని, ఈ విషయం న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ల మధ్య సంబంధాలను ప్రభావితం చేయవచ్చని మూర్ ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభ వెస్ట్ వర్జీనియాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మూర్ ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో భారత్ చట్టాల రూపకల్పన చేస్తుందని చెబుతూ దేశీయ చట్టాలకు వాటికంటూ ప్రత్యేక నేపథ్యం ఉంటుందని, ఈ దృష్టికోణంలోనే చట్టాలను విశ్లేషించాల్సి ఉంటుందని జైస్వాల్ స్పష్టం చేశారు.
‘‘మన ప్రభువైన ఏసుక్రీస్తు పునరుత్థానమైన కొన్ని దశాబ్దాలకే సెయింట్ థామస్ అపొస్తలుడు మలబార్ తీరానికి చేరుకోవడంతో భారతదేశంలో క్రైస్తవం ప్రారంభమైంది.. కానీ ఇంతటి సుదీర్ఘమైన క్రైస్తవ చరిత్ర ఉన్నప్పటికీ, చర్చిలను, మతపరమైన స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం తన అధీనంలోకి తెసుకునేందుకు వీలుగా ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలను సవరించాలని భారత పార్లమెంటు పరిశీలిస్తోంది’’ అని విమర్శిస్తూ ఈ ప్రతిపాదనను క్రైస్తవులపై జరుగుతున్న దాడిగా మూర్ అభివర్ణించారు. పైగా, ప్రస్తుత రూపంలోనే ఈ బిల్లు ముందుకెళ్తే భారతదేశంతో మన ద్వైపాక్షిక సంబంధాలలో అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా మారుతుందని కూడా పేర్కొన్నారు.

More Stories
నీట్ ప్రశ్నలను లీక్ చేసిన ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులు
బోఫర్స్ ముడుపుల ఆరోపణలకు సుప్రీంకోర్టు ముగింపు
రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు