నీట్ ప్ర‌శ్న‌ల‌ను లీక్ చేసిన ముగ్గురు ఎన్టీఏ స‌బ్జెక్ట్ నిపుణులు

నీట్ ప్ర‌శ్న‌ల‌ను లీక్ చేసిన ముగ్గురు ఎన్టీఏ స‌బ్జెక్ట్ నిపుణులు
దేశవ్యాప్తంగా కలకలం రేపి, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన నీట్ యూజీ పేప‌ర్ లీకేజీపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్ర‌కారం ముగ్గురు స‌బ్జెక్టు నిపుణులు పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. ప్ర‌శ్న‌ల‌ను కంఠ‌స్థం చేసి, చిట్టాల మీద రాసుకుని, బుక్స్‌లో సంబంధిత పేరాగ్రాఫ్‌ల‌ను మార్క్ చేసి మ‌రీ పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డిన‌ట్లు సీబీఐ త‌న రిపోర్టులో పేర్కొన్న‌ది.

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన బృందంలోని ముగ్గ‌రు స‌బ్జెక్ట్ నిపుణులు పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డ్డారు. క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల‌ను త‌యారు చేసే బృందంలో ఆ ముగ్గురూ ఉన్నారు. పీవీ కుల‌కర్ణి, మ‌నీశ్ మాంధారే, మ‌నీషా హ‌వ‌ల్దార్‌ అనే ముగ్గురు వ్య‌క్తులు నీట్ యూజీ పేప‌ర్ లీకేజీకి కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా గుర్తించారు.  కెమిస్ట్రీ స‌బ్జెక్టులో కుల‌క‌ర్ణి నిపుణుడు. ఇక వృక్ష శాస్త్రంలో మాంధారే, భౌతిక శాస్త్రంలో హ‌వ‌ల్దార్ నిపుణులు.

నీట్ పేప‌ర్ లీకేజీ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 13 మంది నిందితుల‌ను అరెస్టు చేశారు. ఎన్టీఏ సెంట‌ర్‌లో ప్ర‌శ్నాప‌త్రాల‌ను త‌యారు చేస్తున్న స‌మ‌యంల ఈ ముగ్గురు నిందితులు ప్ర‌శ్న‌ల‌ను కాపీ చేసి వాటిని చీటీల‌పై రాసుకున్నారు. కొన్ని ప్ర‌శ్న‌ల‌ను ఎన్సీఈఆర్టీ బుక్స్‌లో ఉన్న పేరాగ్రాఫ్‌ల్లో మార్క్ చేసిన‌ట్లు సీబీఐ ఛార్జ్‌షీట్ ద్వారా తెలిసింది. ఆ ముగ్గురు నిందితుల‌కు ఎన్టీఏలో క్వ‌శ్చ‌న్ సెట్టింగ్‌, ట్రాన్స్‌లేష‌న్ సెక్ష‌న్ల‌కు యాక్సెస్ ఉంద‌ని ఛార్జ్‌షీట్ ద్వారా తెలిసింది.

ఎన్టీఏ సెంట‌ర్ నుంచి సేక‌రించిన స‌మాచారాన్ని న‌మ్మ‌క‌మైన వ్య‌క్తులు, కోచింగ్ సెంట‌ర్ల ద్వారా విద్యార్థుల‌కు చేరేలా చేశారు. అయితే ఈ ప్ర‌క్రియ డిజిట‌ల్ విధానాల‌ను వాడ‌కుండా నిందితులు త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.  ఆర్థికంగా లాభ‌ప‌డేందుకు, ట్యూష‌న్ విద్యార్థుల్లో స‌క్సెస్ రేట్‌ను పెంచేందుకు నిందితులు ఇలా చేశార‌ని సీబీఐ త‌న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న‌ది.

ప్రైవేటు కోచింగ్ సెష‌న్స్ సంద‌ర్భాల్లో లీక్ చేసిన ప్ర‌శ్న‌ల‌ను విద్యార్థుల‌తో రాయించార‌ని, వాటికి సంబంధించిన ఆధారాల‌ను సేక‌రించిన‌ట్లు కూడా సీబీఐ త‌న ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. తేలికైన ప్ర‌శ్న‌ల‌ను కంఠ‌స్తం చేసి, ఆ త‌ర్వాత త‌మ హోట‌ల్ రూమ్‌లో వాటిని పేప‌ర్‌పై రాసుకునేవార‌ని ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. ఎన్టీఏ విధి నిర్వ‌హ‌ణ‌లోనూ లోపాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఎన్టీఏ కేంద్రం వ‌ద్ద చెకింగ్ కానీ ఫ్రిస్కింగ్ కానీ స‌మ‌ర్థ‌వంతంగా లేదు.

పీవీ కుల‌క‌ర్ణి ఈ కేసులో ఏ2 నిందితుడు. అత‌ను మూడు సెట్ల ప్ర‌శ్నాప‌త్రాల‌కు చెందిన ట్రాన్స్‌లేష‌న్ వ‌ర్క్ కూడా చేశాడు. మూడు రోజుల వ్య‌వ‌ధిలో అత‌ను 135 ప్ర‌శ్న‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేశాడ‌ని త‌న ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొన్న‌ది.  13 మంది నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ స‌బ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ వ్య‌క్తులు, మ‌ధ్య‌వ‌ర్తులు, లాభ‌ప‌డిన విద్యార్థులు ఉన్నారు. ఎన్టీఏలో ప‌నిచేస్తున్న‌ కొంద‌రు త‌మ అధికారాన్ని వాడుకుని ర‌హ‌స్య స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్లు గుర్తించారు.

ఈ కేసుతో లింకున్న‌ సుమారు 20 వేల పేజీల ఆధారాల‌ను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూకోర్టులో సీబీఐ స‌మ‌ర్పించింది. సీబీఐ త‌న విచార‌ణ‌లో భాగంగా 360 మంది సాక్ష్యుల‌ను పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం 13 మంది నిందితులు జుడిషియ‌ల్ క‌స్ట‌డీలోనే ఉన్నారు. మే 12వ తేదీన పేప‌ర్ లీకేజీ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. 72 మంది ఆఫీస‌ర్ల‌తో బృందాల‌ను ఏర్పాటు చేసింది. 8 మంది సైబ‌ర్ ఫోరెన్సిక్ నిపుణులు కూడా సీబీఐ విచార‌ణ‌కు స‌హ‌క‌రించారు.

మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, ఢిల్లీతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని 92 లొకేష‌న్ల‌లో సోదాలు చేప‌ట్టారు. ఆ త‌నిఖీల్లో డిజిట‌ల్, క‌మ్యూనికేష‌న్ డివైస్‌లు, డాక్యుమెంట్లను సీజ్ చేశారు.  స్వాధీనం చేసుకున్న ఆధారాల‌కు చెందిన ఫోరెన్సిక్ ఇమేజింగ్ జ‌రిగిన‌ట్లు సీబీఐ వెల్ల‌డించింది. మే 13వ తేదీన ఈ కేసులో తొలి నిందితుడిని అరెస్టు చేశారు. కోచింగ్ సెంట‌ర్ల‌కు చెందిన ఇద్ద‌ర్ని అదుపులోకి తీసుకున్నారు. డ‌బ్బు లావాదేవీల కోణంలోనూ కూడా ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అనేక బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ లాక‌ర్లు, డీమాట్ అకౌంట్ల‌ను సీజ్ చేసిన‌ట్లు సీబీఐ త‌న రిపోర్టులో పేర్కొన్న‌ది.