కొంత కాలం క్రితం వరకు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉన్న సంగతి విదితమే. టాటాల చేతుల్లోకి వచ్చిన తరువాత ఎయిరిండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు. తాజాగా సంస్థ లగేజి విధానాన్ని కూడా మార్చారు.
దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజిపై గరిష్ఠ పరిమితిని ఎయిరిండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్‌లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగరీల్లో ప్రయాణించేవారు ఇకపై ఉచితంగా 15 కిలోలు మాత్రమే లగేజి తీసుకువెళ్లే వీలు ఉంటుంది. ఎకానమీ క్లాస్‌లోని ఈ రెండు కేటగరీల్లో ఇప్పటి వరకు ఈ పరిమితి 20 కిలోల వరకు ఉండేది. ఎయిరిండియా ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో ఉచిత లగేజి పరిమితి 25 కిలోలు ఉండేది.
ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తరువాత ఈ పరిమితిని 20 కిలోలకు కుదించింది. తాజాగా మరి ఐదు కిలోలో తగ్గిస్తూ, 15 కిలోలు మాత్రమే ఉచితంగా అనుమతిస్తామని ఎయిరిండియా తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిబంధన గురువారం నుంచి అమలులోకి వచ్చింది.
అయితే, ఎకానమీ క్లాస్‌లో ఫ్లెక్స్ కేటగీలో ప్రయాణించేవారికి మాత్రం 25 కిలోల వరకు లగేజిని ఉచితంగా తీసుకువెళ్లేందుకు అనుమతిస్తారు. డిజిసిఎ మార్గదర్శకాల ప్రకారం, ఏ విమానయాన సంస్థ అయినా కనీసం 15 కిలలో లగేజిని ఉచితంగా అనుమతించవలసి ఉంటుంది.
అయితే, ఇతర విమానయాన సంస్థలు ఈ 15 కిలోలను సింగిల్ బ్యాగేజి రూపంలో అనుమతిస్తుండగా ఎయిరిండియా మాత్రం నిర్దేశిత బరువుకు లోబడి ఎన్ని బ్యాగేజీలైనా తీసుకువెళ్లేందుకు అనుమతిస్తోంది.
More Stories
నోయిడా విమానాశ్రయం రన్వేపై తొలి విమానం
మహా కుంభ మేళాకు వెళ్లే వారికి 13వేల రైళ్లు
బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాలలో మూడో స్థానంలో భారత్