దేశ భద్రత, ఆర్థిక నేరాలపైనే దృష్టిపెట్టాలి

గత కొన్నేండ్లుగా సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు అనేక రకాల కేసుల్లో భాగమవుతుండటాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కేసుల ఎంపికలో శ్రద్ధ వహించాలని, తద్వారా దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచొచ్చని కేంద్ర దర్యాప్తు సంస్థలకు  కీలక సూచనలు చేశారు. 
 
ప్రధానంగా జాతీయ భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థకు, శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నేరాలపైనే దృష్టిసారించాలని సూచించారు. సీబీఐ రైజింగ్‌ డే సందర్భంగా సీబీఐ మొదటి డైరెక్టర్‌ డీపీ కోహ్లీ 20వ స్మారక కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రసంగిస్తూ  సాంకేతికత నేరాలను ఏవిధంగా మార్చింది, దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు క్లిష్టమైన సవాళ్లను ఆయన ప్రస్తావించారు.
 
అనినీతి వ్యతిరేక దర్యాప్తు సంస్థ అయిన సీబీఐని దాని పరిధిని మించి వివిధ క్రిమినల్‌ కేసులను దర్యాప్తు చేయాలని కోరుతున్నారని, ఇది ఆ సంస్థపై మోయలేని భారాన్ని మోపుతున్నదని పేర్కొన్నారు. సీబీఐ ఎక్కువగా డిప్యుటేషన్‌ ఉద్యోగులపైనే ఆధారపడుతుంటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
‘అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ పాత్రకు మించి వివిధ రకాల క్రిమినల్ కేసులను విచారించాలని సీబీఐని ఎక్కువగా కోరుతున్నారు.. తన నినాదానికి అనుగుణంగా వ్యవహరించాల్సి బాధ్యత సీబీఐపై ఉంది’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు కేసుల ఎంపికపై దృష్టిపెట్టాలని, దేశ భద్రతకు ముప్పు కలిగించే, దేశానికి వ్యతిరేకంగా జరిగే ఆర్థిక నేరాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. 
సోదాలు చేసేందుకు, పరికరాల స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు ఉండే అధికారాలు, వ్యక్తుల గోప్యతా హక్కుల మధ్య సున్నితమైన సమతుల్యత అవసరమని చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు.  వ్యక్తిగత పరికరాలను అనవసరంగా జప్తు చేయడం తగదని స్పష్టంచేశారు. న్యాయస్థానాలతో పాటు సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలనూ క్రమబద్ధీకరించాల్సి ఉందని పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన కొత్త నేర న్యాయ చట్టాలను సీజేఐ ప్రశంసించారు. న్యాయ వ్యవస్థను ఆధునీకరించడంలో ఇది ఒక కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి దర్యాప్తు ప్రక్రియనంతటినీ డిజిటలైజ్‌ చేయాలని సీజేఐ సూచించారు. దర్యాప్తు సంస్థలు ఏళ్లపాటు అనేక అంశాలను భుజాలపై వేసుకుని ముందుకు సాగలేక పోయాయని, ఏవి ముఖ్యమో వాటినే అవి ఎంచుకుని పని చేయడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచనలు చేశారు. 
భారీ సంఖ్యలో కేసులు ఉన్నందున, జాప్యాన్ని నివారించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. మనం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించడంపై నేర న్యాయ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అన్ని విభాగాలు వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం ద్వారా దర్యాప్తు సంస్థలను అప్‌గ్రేడ్‌ చేయాలని అన్నారు. కృత్రిమ మేధ(ఏఐ)ను గేమ్‌ ఛేంజర్‌గా పేర్కొన్న సీజేఐ.. ఉత్తమ ఫలితం కోసం ఏఐను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు.