సుప్రసిద్ధ రచయిత్రి తేజోవతి మృతి

సుప్రసిద్ధ రచయిత్రి డా. ఎ తేజోవతి (88) ఆదివారం గుంటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం కుటుంభం సభ్యులు అంత్యక్రియలు జరుపుతున్నారు. గుంటూరు లోని సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె తెలుగు సాహిత్యంలో పేరొందిన రచయిత్రిలలో ఒకరు. అనేక నవలలు, కధలు, ఇతర రచనలు చేశారు. అన్ని ప్రముఖ పత్రికలలో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి.
 
పూర్వ సంధ్య ప్రవర్తతే, మృత్యోర్మ అమృతంగమయ, విద్యార్థి వంటి 15కు పైగా నవలలు, 250 దాక కధలు, 100 కు పైగా రేడియో కథానికలు రాశారు.
బొమ్మిడాల జాతీయ సాహిత్య పురస్కారం ఆమెకు లభించింది. ఆ పురస్కారం కింద లభించిన 3 లక్షల రూపాయలు తను చదివిన శ్రీ. శారద నికేతన్ విద్యాలయం అభివృద్ధికి విరాళంగా అందజేశారు.
 
అలాగే నాగార్జున విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం లభించింది. వృద్ధుల ఆశ్రయంకు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం ఇప్పటికీ ప్రతి నెల అందిస్తున్నారు. పలు సామాజిక, సాంస్కృతిక సంస్థలతో సంబంధాలు ఉండెడివి. ఆమె సమాచార శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ కీర్తిశేషులు ఏ విఠల్ రావు గారి సతీమణి. ఆమె కుమారుడు ఎ కిస్మత్ కుమార్ ఉమ్మడి  రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులుగా, జ్యూవిలియన్ బోర్డు డైరెక్టర్ గా పనిచేశారు.