అవినీతిని మట్టి కరిపించడానికే మళ్ళి పోటీ 

2014 తర్వాత మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం అవినీతిని మట్టి కరిపించడానికే తాను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి నిర్ణయించిందని తెలిపారు.  ప్రస్తుత రాజకీయల్లోని అవినీతి చూసి ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నానని తెలిపారు. 
 
రాజంపేట పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తామని ఆయన చెప్పారు. రాజంపేట ఎంపీతోపాటు పార్లమెంట్ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేందరం ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
 రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఐదేళ్లలో ఏం జరిగిందో నా కంటే మీకే బాగా తెలుసు అంటూ ఆ ప్రాంతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సాగిస్తున్న అంతేలేని అవినీతి చర్యలను ప్రస్తావించారు.
నరేంద్ర మోదీ 10 సంవత్సరాలు ప్రధానిగా, 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా  మచ్చలేని నేత అని కొనియాడారు. ప్రజల కోసం ఈ రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి అని,  ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గ వ్యక్తి మోదీ అని తెలిపారు. ఐదు ఇస్లామిక్ దేశాలలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న వ్యక్తి మోదీ అని గుర్తు చేశారు. 

విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని మోదీ ముందే చెప్పారని పేర్కొంటూ గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిందని ధ్వజమెత్తారు. ప్రతి నెల ఆర్బీఐ, కేంద్రం నుంచి అప్పు తీసుకోకపోతే రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లడం కోసం తామంతా కలిశామని స్పష్టం చేశారు. 

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గల ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్‌గా ప్రారంభమై ప్రభుత్వం, రాజకీయాల్లో ఉంటూ… ప్రభుత్వాన్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  2019 నుంచి పాలు, మామిడిపండు వ్యాపారంతో ప్రజల నోరుకొట్టారని, ఇసుక, మద్యం, గనులు, భూములు కొల్లగొట్టి దోచేశారని ఆరోపించారు. 

అడ్డు వచ్చిన వారిపై దొంగ పోలీసు కేసులు పెట్టి దౌర్జన్యకరమైన వాతావరణం సృష్టించారని, తిరుపతి ఉప ఎన్నిక సమయంలో 35 వేల దొంగ ఓటర్ కార్డులు సృష్టించారని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు ఏమి చేయకూడదో అదే చేశారని దుయ్యబట్టారు. దీంతో కలెక్టర్లు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ఈ అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తిరుపతి సంఘటన ఎలక్షన్ కమిషన్‌కు చాలెంజ్‌ చేసే అంశమని తెలిపారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఒక నిఘా పెట్టాలని, ఓటర్లకు సెక్యూరిటీ కల్పించి స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.