రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బిజెపి ఎన్నికల ప్రణాళిక కమిటీ

లోక్‌సభ ఎన్నికల కోసం తమ ఎన్నికల ప్రణాలికను సిద్ధం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో కూడిన 27 మంది సభ్యుల కమిటీని బీజేపీ శనివారం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి కన్వీనర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
 
అనేక ఇతర కేంద్ర మంత్రులు, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే వంటి అనుభవజ్ఞులైన నేతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ 2019 ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీకి కూడా అధిపతిగా ఉన్నారు. ప్రస్తుత ప్యానెల్‌లో కూడా చాలా మంది సభ్యులు పునరావృతం అయ్యారు.
 
కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, భూపేందర్ యాదవ్, కిరెన్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్ ఇందులో సభ్యులు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విష్ణు దేవ్ సాయి, మధ్యప్రదేశ్‌కు చెందిన మోహన్ యాదవ్ కూడా కమిటీలో ఉన్నారు.
 
 కమిటీలో లేని పార్టీ సీనియర్ నాయకులను ఎన్నికలకు సంబంధించిన ఇతర సంస్థాగత కసరత్తులలో భాగం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీహార్‌ నేతలు సుశీల్‌ కుమార్‌ మోదీ, రవిశంకర్‌ ప్రసాద్‌, ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, కేంద్ర మాజీ మంత్రి జువల్‌ ఓరమ్‌, పార్టీ సంస్థాగత నేతలు వినోద్‌ తావ్డే, రాధామోహన్‌ దాస్‌ అగర్వాల్‌, మంజీందర్‌ సింగ్‌ సిర్సా, తారిఖ్‌ మన్సూర్‌, అనిల్‌ ఆంటోనీలు ఇందులో ఉన్నారు.
 
ఆంటోనీ, మన్సూర్ పార్టీ క్రిస్టియన్, ముస్లిం నేతలు కూడా ఉన్నారు. హర్యానా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఓపీ ధంకర్ కూడా సభ్యుడు. పార్టీ ఇప్పటికే వివిధ సమూహాల నుండి సలహాలను కోరే ప్రక్రియలో ఉంది. జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గత నెలలో “విక్షిత్ భారత్ మోదీ కి గ్యారెంటీ” వీడియో వ్యాన్‌లను ప్రారంభించారు. 
 
ఇవి దేశవ్యాప్తంగా పర్యటించి, వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. బిజెపి ప్రారంభం నుండి ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా కనిపించే పలు సైద్ధాంతికంగా ప్రధానమైన అంశాలు ఈ పర్యాయం ఉండే అవకాశం లేకపోవడంతో, ఇప్పుడు కొత్తంగా ఎటువంటి ప్రధాన అంశాలను ప్రస్తావింప బోతున్నారో అనే ఆసక్తి చెలరేగుతుంది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు రామ మందిర నిర్మాణం పూర్తి చేసి, ఇప్పటికే భక్తులకు తెరిచారు. కొన్ని రాష్ట్రాల్లోని దాని ప్రభుత్వాలు సైద్ధాంతికంగా కీలకమైన హామీలలో ఒకటైనా ఉమ్మడి పౌరస్మృతి అమలును చేపట్టాయి.  మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందటం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) అనే లక్ష్యాలపై ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు.