మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతా

మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతా

పిఠాపురంలో ఇల్లు తీసుకుంటానని, ఇక్కడే ఉంటానని, దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ చేశారు. పిఠాపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన జనసేన మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని శనివారం అక్కడి నుండే ప్రారంభిస్తూ పవన్ కళ్యాణ్ మీకు జవాబుదారీతనమని, తాను పారిపోయే వ్యక్తిని కానని స్పష్టం చేశారు.

54 గ్రామాలు ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎన్నికలకి కాదు.. గుండెల్లో పెట్టుకోవడానికి పిఠాపురం వచ్చానని చెబుతూ పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు . పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని తెలిపారు. 

పిఠాపురంలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభలో జనసేనాని పవన్ ప్రసంగిస్తూ తనను ఓడించడానికి చిత్తూరు నుంచి మిధున్ రెడ్డి వచ్చాడని విస్మయం వ్యక్తం చేశారు. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టలేని తాను అంటే ఎందుకు కక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. మండలానికి ఒక నాయకుడు ఎందుకు వచ్చాడని పేర్కొంటూ కాకినాడ మాఫియా డాన్ నన్ను ఓడిస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు.

పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని చెబుతూ ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం తిరిగే తాను పిఠాపురాన్ని వదిలేస్తా అనుకోవద్దని కోరారు. పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యతను తీసుకున్న టీడీపీ కోఆర్డినేటర్ వర్మకి కృతజ్ఞతలు తెలిపారు.

ఓడిపోయినా దశాబ్ధ కాలం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. దయచేసి తనను గెలిపించాలని, ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురంకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ తీసుకువస్తానని పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. పిఠాపురం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉందని ఆయన తెలిపారు.

తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునని, జగన్‌లా సీఎం కొడుకును కాదని చెప్పారు. మిధున్ రెడ్డి 60 నియోజకవర్గాలలో దోచేసిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడని ఆయన ఆరోపించారు. సజ్జల, పెద్దిరెడ్డి, జగన్ అందరూ పేద వారే.. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని తాను పెత్తందారీనా? అంటూ ప్రశ్నించారు.

ఆలయాలు ధ్వంసం చేసిన ఎంత మందిని పట్టుకున్నారని వంగా గీతను అడగండి అంటూ ప్రజలను కోరారు. తాను గెలిచిన తర్వాత కాకినాడ మాఫియా డాన్‌ను పిఠాపురం రమ్మను.. తాటాకు చప్పుళ్ళకి భయపడను తోలు తీస్తానని హెచ్చరించారు. కాకినాడ పోర్టులో ఎన్నికల ఖర్చుకి డబ్బులు కంటైనర్‌లలో పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్ట్ డ్రగ్ మాఫియా, బియ్యం మాఫియా, ఆయిల్ మాఫియాకి కేంద్రంగా మారిందని మండిపడ్డారు.