నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించింది. నిత్యం పదిమంది సాయుధులు ఆయనకు రక్షణ కల్పించనున్నారు. ఆదివారం నుంచే కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎ్‌ఫ)లోని వీఐపీ వింగ్‌కు చెందిన సాయుధ కమాండోలు రక్షణగా నిలుస్తారు. ఆదివారం 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేశ్‌ ఇంటికి చేరుకోనున్నారు. 
 
శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేశ్‌కు ఈ మేరకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సెక్యూరిటీని జాతీయ భద్రతా దళ విభాగం భర్తీ చేసింది. 2019కు ముందు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేశ్‌కు జడ్‌ కేటగిరి భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. 
 
మావోయిస్టుల ప్రభావం ఏవోబీలో ఉండటం, చంద్రబాబు కుటుంబాన్ని అంతం చేస్తామని మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించడం, ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను గత ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు మావోయిస్టులు హత్య చేయడం లాంటి ఘటనలతో లోకేశ్‌కు గత ప్రభుత్వంలో పోలీసులు భద్రత పెంచారు. 
 
ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో లోకేశ్‌కు భద్రత తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసుల్ని పక్కనబెట్టి వై కేటగిరీ భద్రత కల్పించి లోకేశ్‌ బయట స్వేచ్ఛగా తిరగకుండా చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకుడైన ఆయనకు జడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలంటూ పద్నాలుగు సార్లు రాష్ట్ర హోంశాఖ, పోలీసు బాస్‌కు లేఖలు రాసినా కనీసం స్పందించలేదు. 
 
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి కోసం 400మందికి పైగా ప్రత్యేక సాయుధులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దేశ, విదేశాల్లోని ఆయన కుటుంబ సభ్యులకు సైతం రక్షణ కల్పించేలా చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లోకేశ్‌కు భద్రత పెంచాలని గవర్నర్‌, కేంద్ర హోంశాఖకు ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించే అధికారులు లేఖలు రాశారు. 
 
యువగళం పాదయాత్రలో ఆయన్ను వైసీపీ ప్రేరేపిత అల్లరిమూకలు కవ్వించిన వీడియోలు, భౌతిక దాడులకు దిగిన దృశ్యాలతో పాటు ఇతరత్రా భద్రతా పరమైన ఆవశ్యకతను వివరిస్తూ లేఖ రాయడంతో కేంద్రం స్పందించింది.