వాలంటీర్లు నగదు పంపిణీ చేయించొద్దని ఈసీ ఆదేశాలు

వలంటీర్లను వాడుకొని ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందాలనుకొని కుయుక్తులు పన్నిన అధికార వైఎస్సార్‌సీపీకి ఊహించని షాక్ తగిలింది. వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం, వారికి నిధులు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది.
 
లంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు వెల్లడించారు. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్‌, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోకు పంపిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
 
ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ ఆదేశించింది.

వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించాలని ఈసీ ఏపీ సీఈవోకి ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల విధులపై అభ్యంతరం తెలుపుతూ సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో ఫిబ్రవరిలో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసులో మార్చి 13న హైకోర్టు ఈసీకి పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఈసీ తాజాగా వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. 

వాలంటీర్లపై తరచూ వస్తున్న ఫిర్యాదులు, న్యూ పేపర్లలో వస్తున్న రిపోర్టులు, క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు ఓటర్లపై ప్రభావం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్లను సంక్షేమ పథకాల నగదు పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించింది. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఈసీ ఆదేశించింది. అయితే కొందరు వాలంటీర్లు ప్రచారాల్లో పాల్గొంటున్నారు. వీరిపై వస్తున్న ఫిర్యాదులతో ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై చర్యలు తీసుకుంటుంది.

1. పింఛన్లతో పాటు నగదు పంపిణీ చేసే ప్రభుత్వ పథకాల నుంచి వాలంటీర్లను దూరం పెట్టాలి.

2.వాలంటీర్లు ఉపయోగించే మొబైల్, టాబ్లెట్, ఇతర పరికరాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకూ జిల్లా ఎన్నికల అధికారి వద్ద డిపాజిట్ చేయాలి.

3. ప్రభుత్వ పథకాల నగదు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేదా డీబీటీ విధానాన్ని అమలు చేయాలి.

వాలంటీర్ల, సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధులు అప్పగించవద్దని పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని ఈసీ ఆదేశించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లు కూడా అనుమతించవద్దని ఏపీ సీఈవో తెలిపారు.

పథకాల పంపిణీ నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సిఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్వాగతించారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్ల జోక్యాన్ని పూర్తిగా లేకుండా చేయాలంటూ సీఎ్‌ఫడీ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికార వైసీపీ రాజకీయ ఆకాంక్షల మేరకు వలంటీర్ల వ్యవస్థ పనిచేసే ప్రమాదముందని హెచ్చరించినట్టు పేర్కొన్నారు.