ఏపీ ప్రభుత్వ నిధులు విడుదల ఎత్తుగడకు ఈసీ అడ్డు 

ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలకు నిధుల విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సమయంలో ప్రజలకు నిధులు విడుదల చేసేందుకు  ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. విడుదలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది.

తుపాను, కరవు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు అందించే ఇన్ ఫుట్ సబ్బిడీ.. విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు అంగీకరించాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎప్పడో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇప్పడు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి స్కీనింగ్ కమిటీ ప్రతిపాదనలు పంపించింది.

డీబీటీ విధానం ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఈసీకి లేఖ రాసింది.ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని.. కొత్త పథకాలు కావని పేర్కొంది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కావున నిధుల విడుదలకు అంగీకరించాలని కోరింది.

అయితే, ఏడు నెలల క్రితం వచ్చిన తుఫానుకు ఇప్పడు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఏంటని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులని అధికార వైసీపీ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఇచ్చే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. స్కీనింగ్ కమిటీకి చైర్మన్‌గా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 
 
రైతులు, విద్యార్థులకు ప్రభుత్వం సాయం ఇస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి ప్రతిపక్షాలు వీటిని ఆపివేసిందని ప్రచారం చేసేందుకే ఈ నాటకం అంతా జరుపుతున్నట్లు భావిస్తున్నారు.  ఎప్పడో జరిగిన నష్టానికి ఎన్నికలకు వారం రోజులు మందు ఇవ్వడం ఏంటని కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 
ఎన్నికలు అయిపోయాక ఆ నష్టపరిహారం ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా ప్రస్తుతం నిలిపి వేయాలని ఈసీ ఆదేశించింది.  గతంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేటివరకూ తల్లులు ఖాతాలో జగన్ సర్కార్ వేయని విషయం తెలిసిందే. ఉద్యోగుల జీతాలనే ఇవ్వని సర్కార్ ఇప్పుడు కొత్తగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో కొత్తడ్రామా మొదలు పెట్టింది.
 
ఎన్నికల కోడ్ పూర్తయ్యాక నిధులు విడుదల చేసుకోవాలని ఈసీ సూచించింది. మరోవైపు ఏపీలో మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు వెల్లడయ్యేవరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.