ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు ఈసీ బ్రేక్

ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో డిఎస్సి పరీక్షపై విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
 కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణ, టెట్ ఫలితాల విడుదలకు ఈసీని అనుమతి కోరుతూ విద్యాశాఖ లేఖ రాసింది.
తాజాగా దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వద్దని ఈసీ ఆదేశించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో మరోసారి డీఎస్సీ పరీక్షలను ఇప్పటికే విద్యాశాఖ వాయిదా  వేసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తర్వతే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని పేర్కొంది.
పరీక్ష కేంద్రాల ఎంపిక ఆప్షన్లు కూడా ఈసీ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అయితే, డిఎస్సి షెడ్యూల్ ప్రకారం మార్చి 25న నుంచే ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈసీ అనుమతి రాగానే హాల్ టికెట్లను విడుదల చేస్తామని ఇటీవలే విద్యాశాఖ పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవటంతో మరోసారి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడాల్సి వచ్చింది. 
 
టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య వ్యవధి ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పటికే ఓసారి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఏపీ టెట్ ఫలితాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఫలితాలు వెలువడలేదు. 
 
ఎన్నికల కోడ్ కారణంతోనే టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. ఈసీ అనుమతి ఇస్తేనే టెట్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రస్తుతం టెట్ ఫలితాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ టెట్ ఫలితాలు విడుదల చేయొద్దని ఈసీ ఆదేశించింది.