ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలపై 8 లక్షల అవినీతి ఫిర్యాదులు

వైసీపీ జగన్‌ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై లక్షలాధి ఫిర్యాదులు వస్తే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.  ఐదేళ్ల పాలనలో ఏసీబీకి 8.03 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. 

మంత్రులు, వారి ఫేషిలపై 2.06 లక్షలు, ఎమ్మెల్యేల అవినీతిపై 4.39 లక్షల ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. పాలన పారదర్శకంగా జరుగుతుందని, అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయని వైఎస్‌ జగన్‌ సొంతగా సర్టిఫికేట్‌ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అన్ని శాఖల్లోనూ అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.2,500 కోట్లు ఖర్చుతో గేదెలు కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని పేర్కొంటూ ఏ గ్రామంలోనూ గేదెలు పంచిన దాఖలాలు లేవని మండిపడ్డారు.

కాగా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 30 నుంచి 10 నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. 30 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పిఠాపురం నియోజకవర్గంలో, 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి నియోజకవర్గంలో, 6న యలమంచిలి, 7న పెందూర్తి, 8న కాకినాడ గ్రామీణ, 9న పిఠాపురంలో , 10న రాజోల్‌, 11 పి. గన్నవరం, 12న రాజనగరం నియోజకవర్గంలో మొదటి విడత ప్రచారం చేస్తారని వివరించారు.