తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత- పలు జిల్లాల్లో వడగాల్పులు

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత, వడగాల్పులతో ప్రజానీకం అల్లాడుతున్నది.   ఉదయం నుంచే భానుడి భగభగలాడుతున్నాడు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఎండల తీవ్రంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
 
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు(ఏప్రిల్ 3 వరకు) పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.  ఏప్రిల్ 1న నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు ప్రకటింటింది. 
 
ఏప్రిల్ 2న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో నారాయణ పేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని  ప్రకటించింది.
మరోవంక, ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అతి సాధారణంగా నమోదు అవుతున్నాయి. ఆదివారం 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం 64 మండలాల్లో వడగాల్పులు, ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
 
శనివారం ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 52 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఆయన పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడగాడ్పులు వీచినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అవుకులో 43.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయ్యిందని వెల్లడించారు. 
 
రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో వడగాల్పులు వీయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.  సోమవారం ఏపీలోని 64 మండలాల్లో అసాధారణ స్థాయిలో వడగాడ్పులు, మరో 52 మండలాల్లో ఓ మాదిరి వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.