రాడిసన్ డ్రగ్స్ కేసులో క్రోమోటోగ్రఫీ పరీక్ష

రాడిసన్ డ్రగ్స్ కేసులో క్రోమోటోగ్రఫీ పరీక్ష
హైదరాబాద్‌లో సంచలనంగా మారిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన పలువురిని గుర్తించిన పోలీసులు వాళ్లందరికీ కొన్ని టెస్టులు చేశారు. అయితే కేవలం ముగ్గురి శరీరాల్లోనే డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు.  అందులో కొంత మంది తెలివిగా వ్యవహరించి డ్రగ్స్ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారని భావిస్తున్న పోలీసులు.సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. 
 
తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఈ కేసులో క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో న్యాయస్థానం నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూకట్‌పల్లి కోర్టు అనుమతి కోరగా పోలీసులకు నిరాశే ఎదురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి హైకోర్టు అనుమతి ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో మొదటి పరీక్ష క్రోమోటోగ్రఫీ అవుతుంది. 
ఈ పరీక్ష నిర్వహిస్తే.డ్రగ్స్ తీసుకున్నవారు ఎవరనేది పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించేందుకు వెంట్రుకలు, గోళ్లు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించేవాళ్లు. అయితే ఈ పరీక్ష ద్వారా బయటపడకుండా ఉండేందుకు కొన్ని కిటుకులు ఉండటంతో వాటిని కొందరు అవలంభిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
దీంతో ఇప్పుడు ఈ క్రోమోటోగ్రఫీ పరీక్షకు సిద్ధమయ్యారు. దీంతో డ్రగ్స్ తీసుకున్న వారు ఇక తప్పించుకోలేరని భావిస్తున్నారు. అయితే  రాడిసన్ హోటల్‌లో ఫిబ్రవరి 24వ తేదీన డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దాడులు చేశారు. 

పోలీసుల తనిఖీల్లో హోటల్‌లో డ్రగ్స్ దొరికాయి. దీంతో.. ఆ పార్టీకి వచ్చిన మొత్తం 14 మందిని పోలీసులు గుర్తించి.. వాళ్ల శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించారు. అయితే అందులో కొందరు వేరే ప్రదేశాల్లో ఉన్నామని వచ్చేందుకు సమయం పడుతుంందంటూ మూడు నాలుగు రోజుల త్వరాత శాంపిల్స్ ఇచ్చారు. దీంతో.. కేవలం ముగ్గురికి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

ఈ కేసుతో చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులకు సంబంధం ఉందని వార్తలు వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇప్పటికే కొందరిని అందుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు కూడా. ఇక  మిగతావాళ్లకు కూడా సంబంధం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఈ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.