ఇడ్లీకి ఒక రోజు….. నేడే ఇడ్లీ దినోత్సవం

మనం ప్రతి రోజూ ఉదయం తినే టిఫిన్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇడ్లీకే ఇస్తాం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం. అందుకు కారణం అది తేలికపాటి ఆహారం. ఇది రుచికరమైనదే కాకుండా, ఆరోగ్యవంతమైన ఆహారం. ఇడ్లీ తినడం ద్వారా త్వరగా జీర్ణం అవడమే కాకుండా మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. 
 
అయితే, అంతటి ఇడ్లీకి ఒక ప్రత్యేకమైన రోజు ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? అవునండీ.. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే అలా అన్నింటికీ ప్రత్యేకమైన రోజు ఉన్నట్లుగానే  ఇడ్లీకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. మార్చి 30 వ తేదీని ఇడ్లీ రోజుగా పాటిస్తారు. 

2015లో చైన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ దీనిని గుర్తించారు. ఆయన దాదాపు 1,328 రకాల ఇడ్లీలను తయారు చేశారు. అదే రోజు ఒక 44 కిలోల పెద్ద ఇడ్లీని తయారు చేసి ఇడ్లిపై తనకున్న ఇష్టాన్ని చాటి చెప్పాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ భారీ ఇడ్లిని కట్ చేసాడు అప్పటి నుండి మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఇడ్లిని భారతీయులందరు అల్పాహారంలో ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి దేశ వ్యాప్తంగా ఏంతో ప్రాముఖ్యత వుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇడ్లిని మొదటగా తయారు చేసింది భారతీయులు కాదు. ఇడ్లీకి మూలం ఇండోనేషియా దేశం అని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ వంటకం 800 నుండి 1200  నాటి కాలంలో భారతదేశానికి వచ్చిందని భావిస్తున్నారు.

ఇడ్లీలు తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి వీటిని ఆహారంలో స్వీకరించడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది తేలికపాటి వంటకం. దీంతోపాటు ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఇడ్లీల ద్వారా ఆరోగ్యానికి మంచి ప్రోటీన్లు లభిస్తాయి. దీంతోపాటు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందడంతోపాటు మెరుగైన శోషణకు అవకాశం ఉంటుంది.

ఇడ్లీలు ఆహారంలో తీసుకోవడం ద్వారా మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిణ్వ ప్రక్రియ కారణంగా ఇడ్లీలు ప్రోబయోటిక్స్ ద్వారా కొన్ని సూక్ష్మజీవులను నియంత్రిస్తాయని వైద్య ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇడ్లి ఆకలిని తీర్చడమే కాకూండా శక్తి కోసం కార్బోహైడ్రేట్లను, పెరుగుదలకు ప్రోటీన్ ఇస్తుంది. ఇందులోని మంచి బాక్టీరియా చాలా విటమిన్ బిని ఉత్పత్తి చేస్తుంది.

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇడ్లీని రోజూ తినే వ్యక్తికి తల నొప్పి రాకపోవచ్చు, ఎందుకంటే నల్ల శనగలో తల నొప్పిని నిరోధించే గుణం ఉంది.  దీనితో పాటు ఉపయోగించే సాంబార్ అనేది అనేక కూరగాయలు, మసాలాలు, చింతపండు, ఇంగువ మొదలైన వాటిని కలిగి ఉండే పోషకమైన కూరగాయల పులుసులో ఒకటి. ఇది కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఆమ్లత్వం,  అజీర్ణాన్ని నివారిస్తుంది.

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇడ్లీ ప్రపంచంలోనే అత్యంత పోషకమైన ఆహారం. పులియబెట్టిన నల్ల పప్పు, బియ్యంతో తయారు చేస్తారు. ఇడ్లీలో పోషక పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇడ్లీని ఆదర్శవంతమైన ఆహారంగా సిఫార్సు చేసింది. మనదేశంలో ఇడ్లీ ఇడ్లీపై తొలి రచనలు కర్ణాటకలో చూడవచ్చు. 920 సంవత్సరంకు చెందిన శివకోటి ఆచార్య వడ్డారాధనే., అతిథి / బ్రహ్మచారి గృహాలను సందర్శించే 18 వస్తువులలో ఇడ్లీ ఒకటి అని వర్ణించారు.