సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ విచారణ

* సునీత సీఎం కాబోతున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్‌ కే జ్రీవాల్‌ అరెస్టుతో ఇబ్బందుల్లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరిన్ని సమస్యలు మొదలయ్యేలా ఉన్నాయి. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. 
 
సత్యేందర్‌ జైన్‌పై విచారణ కోసం సీబీఐ పంపిన ప్రతిపాదనను ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా పంపించగా శుక్రవా రం అంగీకరించింది. తన నుంచి సత్యేందర్‌ 2018 నుంచి 2021 మధ్య కాలంలో బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారని తీహార్‌ జైలులో ఉన్న ఘరానా మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ చేసిన ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ విచారణ ప్రారంభించనుంది. 
 
తీహార్ జైలు నుంచి జైన్, ఆ జైలు మాజీ డీజీ సందీప్ గోయెల్ కలిసి దోపిడీ రాకెట్ నడిపించారని, మనీలాండరింగ్ కేసులో జైన్ తీహార్ జైలులో ఉన్నప్పుడు రక్షణ సొమ్ముగా తనను రూ.10 కోట్లు డిమాండ్ చేశారని సుఖేష్ చంద్రశేఖర్ గతంలో ఫిర్యాదు చేశారు. జైన్ 2018-2021 మధ్య పలు వాయిదాలలో రూ.10 కోట్ల రక్షణ సొమ్ము తీసుకున్నాడని ఆరోపించారు. 
 
జైన్, ఇతర తీహార్ జైలు అధికారులు డబ్బులు తీసుకుని తమ ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేసేవారని, జైలులో ఉన్న వారికి జైలు నిబంధనావళికి భిన్నంగా అనేక సౌకర్యాలు కల్పించేవారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్జీకి కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
 
ఇప్పటికే మనీ లాండరింగ్‌ కేసులో సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన తీహార్‌ జైలులో ఉన్నారు. ఒకవైపు అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌పై ఈడీ విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు సీబీఐని కూడా కేంద్రం రంగంలోకి దింపడంతో ఆప్‌కి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సిన వేళ ఆ పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారనున్నది.

ఇలా ఉండగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు కేజ్రీవాల్‌ సతీమ ణి సునీత కేజ్రీవాల్‌ సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీహార్‌ లో రబ్రీదేవిలానే మీరు చెప్తున్న మేడం (సునీత కేజ్రీవాల్‌) సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు’ అని తెలిపారు.

కాగా, జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌ వాట్సాప్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. ‘కేజ్రీవాల్‌ కో ఆశీర్వాద్‌’ పేరుతో 8297324624, 9700297002 నం బర్లకు వాట్సాప్‌ ద్వారా సందేశాలు పం పాలని కోరారు. అయితే, ఆప్‌ లోక్‌సభ ఎన్నికల వ్యూహం, ఇండి యా కూటమి నేతలతో చర్చలు వంటి కీలక అంశాలను తెలుసుకునేందుకే  ఈడీ కేజ్రీవాల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ అడుగుతున్నదని మంత్రి ఆతిశీ ఆరోపించారు.