కాంగ్రెస్‌ పార్టీకి అభ్య‌ర్ధుల కొర‌త

కాంగ్రెస్ పార్టీని నిధుల కొర‌త వెంటాడ‌టం లేద‌ని, ఆ పార్టీకి అభ్య‌ర్ధుల కొర‌త ఉంద‌ని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షెహ‌జాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసుల జారీపై ఆ పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నార‌ని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తాను రాజ్యాంగానికి, దేశ చ‌ట్టాల‌కు అతీత‌మ‌ని భావిస్తోంద‌ని ఆరోపించారు.

ప‌న్ను ఎగ‌వేసి అస‌త్యాలు చెబుతూ బాధితుల‌మ‌ని సానుభూతి సంపాదించ‌వ‌చ్చ‌నేది కాంగ్రెస్ ఆలోచ‌న‌ని పూనావాలా విమర్శించారు. సామాన్య ప్ర‌జ‌లు ప‌న్నులు క‌డుతుంటే కాంగ్రెస్ మాత్రం వీవీఐపీ క్యాట‌గిరీగా భావిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. వారి దోపిడీ ప‌ట్టుబ‌డ‌గానే ప‌న్ను చెల్లించేందుకు వెనుకాడుతున్నార‌ని మండిపడ్డారు.

2021లో నోటీసులు వ‌చ్చినా దాన్ని స‌వాల్ చేయ‌డంలో కాంగ్రెస్ జాప్యం చేసింద‌ని, ఆపై స‌వాల్ చేసిన త‌ర్వాత వారికి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేద‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ, బీజేపీని గుడ్డిగా వ్య‌తిరేకించే కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు దేశ వ్య‌వ‌స్ధ‌ల‌పైనా దాడికి తెగ‌బ‌డ్డార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ఇది కాంగ్రెస్ అస‌హ‌నాన్ని వెల్ల‌డిస్తోంద‌ని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ ధీర‌జ్ సాహు నివాసంలో రూ. 350 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయ‌ని గుర్తు చేశారు.  వారి ఎంపీల వ‌ద్ద చాలా డ‌బ్బు ఉంద‌ని, ఇది నిధుల స‌మ‌స్య కాద‌ని ఆ పార్టీకి అభ్య‌ర్ధుల కొర‌త ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.