దేవెగౌడ కొడుకు, మనవడులపై అశ్లీల వీడియో కేసు

మాజీ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై  లైంగిక వేధింపులకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్. ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన హాసన్‌లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికలలో ఆ పార్టీ తరపున గెలుపొందిన ఏకైక లోక్ సభ సభ్యుడు.

వారింట్లో వంటమనిషి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 354 ఎ, 354 డి, 506, మరియు 509 కింద తండ్రీకొడుకులిద్దరిపై హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రేవణ్ణ భార్య భవాని బంధువుగా చెప్పుకుంటున్న ఆమె  ఉద్యోగం ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత, రేవణ్ణ తనను లైంగికంగా వేధించేవాడని ఆరోపించింది. 

అతని కుమారుడు ప్రజ్వల్ తన కుమార్తెకు వీడియో కాల్స్ చేస్తూ “అసభ్యంగా” మాట్లాడుతున్నాడని ఆరోపించింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించింది. బిజెపితో జేడీఎస్ పొత్తుతో ఈసారి లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుండటం, మూడో దశ ఎన్నికలకు ముందు ఈ వీడియో సర్య్యులేట్ కావడం సంచలనమైంది. 

తన ప్రతిష్టను భంగపరిచి, ఓటర్ల మనసుల్లో విషబీజాలు నాటేందుకు నకిలీ వీడియోను పోస్ట్ చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రేవణ్ణ ప్రజ్వల ఆరోపించారు. నకిలీ సెక్స్ వీడియో స్కాండిల్‌పై ప్రత్యేక విచారణ బృందానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించిన మరుసటి రోజే పోలీసులకు రేవణ్ణ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 ప్రజ్వల్ అశ్లీల వీడియో కేసుపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం రాత్రి సామాజిక మాధ్యమంలో ‘ఎక్స్’లో తెలిపారు.  ఒక మహిళపై లైంగిక దాడి జరిగినట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి హసన్ జిల్లాలో సర్క్యులేట్ అవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. 

దీనిపై ‘సిట్’తో దర్యాప్తు జరిపించాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారని, దీని ఆధారంగా ప్రత్యేక టీమ్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

కాగా, ఇటీవల కాలంలో పలువురు మహిళలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కాగా, తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో  శుక్రవారం పోలింగ్ పూర్తికాగానే, శనివారం జర్మనీకి వెళ్ళిపోయిన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.