ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే ప్రభుత్వం కోరుకొంటున్న టిఎంసి

‘ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే’ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో నడ్డా ప్రసంగిస్తూ, మమతా బెనర్జీ సారథ్యంలోని టిఎంసి ప్రభుత్వం అవినీతి, దోపిడీ, బుజ్జగింపు, వివక్షలకు పేరొందిందని ధ్వజమెత్తారు.

‘మేము ‘మజ్బూత్ సర్కార్’ గురించి మాట్లాడుతుంటాం. కానీ మమతా బెనర్జీ ‘మజ్బూర్ సర్కార్’ను కోరుకుంటున్నారు. బుజ్జగింపు, అవినీతి, వివక్షపై విశ్వాసం ఉన్న, ఉగ్రవాదులపై సరళ స్వభావం ఉన్న ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలని ఆమె వాంఛిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. చొరబాటుదారుల పట్ల సుముఖంగా ఉండే, సిఎఎను వ్యతిరేకించే ఆమె బుజ్జగింపు రాజకీయాలను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. 

ఆమె ప్రభుత్వానికి ఉగ్రవాదులపై సానుభూతి ఉందని కూడా నడ్డా ఆరోపించారు. సుమారు 26 వేల మంది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చిన స్కూలు ఉద్యోగాల కుంభకోణాల గురించి నడ్డా ప్రస్తావిస్తూ, టిఎంసి పాలనలో అవినీతి, లూటీ పరిపాటిగా మారాయని ఆయన ఆరోపించారు.

‘పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రభుత్వం లెక్కలేని కుంభకోణాలు మినహా మరేమీ ఇవ్వలేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం వల్ల వేలాది మంది జీవనోపాధికి, అవకాశాలకు నష్టం వాటిల్లింది& రాష్ట్రంలో అవినీతి, లూటీ దైనందిన కార్యక్రమాలుగా మారాయని ఇది నిరూపిస్తోంది’ అని నడ్డా పేర్కొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్ కలీ లోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని, ఆయన విమర్శించారు. వారి వల్ల మహిళలకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సందేశ్‌కలీ లోని మహిళలు , వారి భూములను రక్షించడానికి వెళ్లిన దర్యాప్తు సంస్థల సిబ్బందిపై దారుణంగా దాడులు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ పరిస్థితుల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌తో స్థానికులకు రక్షణ కల్పిస్తామని నడ్డా భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ బలహీన ప్రభుత్వానికి, ఆటవిక పాలనకు సందేశ్ కలీ సంఘటన ఓ ఉదాహరణగా వ్యాఖ్యానించారు. సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామీ వివేకానంద, అరబిందో వంటి ప్రముఖులు పుట్టిన బెంగాల్ గడ్డ మీద ప్రజలను భయపెట్టి, బెదిరించి ఈ ఎన్నికల్లో గెలవడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

గెలుపు కోసం ఆమె ఎలాంటి వ్యూహాలు అమలు చేసినా ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. బెంగాల్‌లో 35 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.  నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ, వృద్ధ పార్టీ ‘బుజ్జగింపు రాజకీయాలను హేయనీయంగా ప్రదర్శిస్తూ ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి సోదరులు, సోదరీమణుల హక్కులను కబళించాలనే ఆత్రుతతో ఉన్నది, రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను బుజ్జగిస్తున్నది’ అని ఆరోపించారు.