బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ కన్నుమూత

బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. సుశీల్‌ కుమార్‌ మోదీ ఏడు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గత నెలలో ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఆరోగ్యం సహకరించనందున ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సుశీల్‌మోదీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆయన ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. 1973లో విద్యార్థి నేతగా ప్రజా జీవనం ప్రారంభించారు. పాట్నా యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ప్రధాన కార్యదర్శిగా ఆన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన `సంపూర్ణ క్రాంతి’ విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర వహించారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శిగా చాలాకాలం పనిచేశారు.  సుశీల్‌ మోదీ 1990లో పట్నా సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిజెపి శాసనసభ పార్టీ చీఫ్ విప్ గా, 1996 నుండి 2004 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఎంపీగా సేవలందించారు. 2004లో భాగల్పూర్ నుండి లోక్ సభకు ఎన్నికైనా ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు 2005లో రాజీనామా చేశారు.

2005 నుంచి 2020 మధ్య రెండు దఫాలుగా 11 ఏళ్ల పాటు బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఈ ఏడాది మొదట్లోనే పదవీకాలం పూర్తి చేశారు. సుశీల్‌ మోదీ కన్నుమూతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఆయన ఉన్నత ఆదర్శాలను పాటించారని పేర్కొన్నారు.

“శ్రీ సుశీల్ కుమార్ మోదీ  ఆకస్మిక మరణం పూడ్చలేని లోటు. ఆయన సౌమ్య స్వభావం, సమర్థ పరిపాలనాదక్షుడిగా సహకారం, ప్రజా జీవితంలో చిత్తశుద్ధి గల వ్యక్తిత్వం పనిలో ప్రతిబింబించాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర శాసనసభ ఉభయ సభల సభ్యుడుగా శ్రీ సుశీల్ కుమార్ మోదీ ఉన్నత ఆశయాలను నిలబెట్టారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ నష్టాన్ని భరించే శక్తిని ఆయన కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను“ అంటూ రాష్ట్రపతి నివాళులు అర్పించారు. 

ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘నా స్నేహితుడు, సహచరుడు సుశీల్‌మోదీ ఆకస్మిక మరణం తీవ్ర విచారం కలగజేసింది. బిహార్‌లో బీజేపీ విజయయాత్రలో ఆయనది అత్యంత కీలకపాత్ర. జీఎస్టీ అమలుకు సంబంధించి ఆయన సేవలు మర్చిపోలేం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. బీహార్‌లో బిజెపి ఎదుగుదల, విజయంలో ఆయన అమూల్యమైన పాత్ర పోషించారని, ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారుని ప్రధాని మోదీ కొనియాడారు. ఎంతో కష్టపడి, స్నేహశీలి అయిన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారని, రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని తెలిపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సుశీల్ మోదీ అకాల మరణానికి సంతాపం తెలిపారు. బిజెపి సీనియర్ నాయకుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ సుశీల్ మోడీ జీ మరణవార్త చాలా బాధాకరమని చెబుతూ  విద్యార్ధి పరిషత్ నుండి ఇప్పటివరకు తాము చాలా కాలం పాటు సంస్థ కోసం కలిసి పనిచేశామని గుర్తు తెచ్చుకున్నారు. సుశీల్ మోదీజీ జీవితమంతా బీహార్‌కే అంకితం చేశారని, బీహార్‌ను జంగిల్‌ రాజ్‌ నుంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఆయన కృషి ఎంతగానో ఉపయోగపడిందని నివాళులు ఆర్పించారు.
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ, “బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ సుశీల్ కుమార్ మోడీ మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం ప్రజల సేవ, సంక్షేమం కోసం అంకితం చేయబడింది. బీహార్‌లో పార్టీని బలంగా, ప్రజాదరణ పొందేందుకు ఆయన చాలా కష్టపడ్డారు” అని తెలిపారు. బిహార్‌ ముఖ్యమంత్రి  నితీశ్‌కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, పలు పార్టీల నేతలు సుశీల్‌మోదీ మృతికి సంతాపం తెలిపారు. మంగళవారం సుశీల్‌ మోదీ అంత్యక్రియలు జరగనున్నాయి.