ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్.. 80 శాతానికి చేరువలో ఓటింగ్​

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడంతో ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 68 శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు ఉండటంతో.. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.

గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సగటున రెండు నుంచి రెండున్నర గంటలపాటు క్యూలైన్లలో నిలుచోవాల్సి వచ్చినా ఓటర్లు తమ సంకల్పం వీడలేదు. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం వేళలోనూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత 3500కుపైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. రాత్రి 11 గంటల వరకు కూడా పలు చోట్ల పోలింగ్ కొనసాగింది. విశాఖపట్నం జిల్లాలో దాదాపు 135 పోలింగ్ కేంద్రాల్లో అర్దరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి తర్వాత కూడా పోలింగ్ కొనసాగడం గమనార్హం.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని భూపతిపల్లెలో 96వ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే ఐదుసార్లు ఇలా అంతరాయం కలగడంతో సోమవారం అర్దరాత్రి వరకూ వేచివుండి 200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అర్దరాత్రి వరకు కొనసాగడంతో పోలింగ్ శాతం 80 శాతానికిపైగా నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64 శాతం మేర పోలింగ్‌ జరిగింది. అప్పటితో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఈసీ అంచనా వేస్తోంది.

ఇక, పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ.. ప్రజలు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఎండా, వానలను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. హైదరాబాద్ నగరం నుంచి కూడా భారీ సంఖ్యలో ఏపీకి తరలివచ్చి తమ ఓటును వేశారు. పోలింగ్ శాతం బాగా పెరిగిందని.. గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని, ఇప్పుడే పోలింగ్ శాతం చెప్పలేమని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదని భావిస్తున్నామని ఆయన అన్నారు

తెనాలి, నరసరావు పేట ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశామని, ఈవీఎం యూనిట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నామని.. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారని పేర్కొన్నారు. ఈవీఎం మెషీన్లతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, సాంకేతిక ఇబ్బందులు గతంతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని,  ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని సీఈవో చెప్పుకొచ్చారు.

కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామని చెబుతూ పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని, పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని మీనా తెలిపారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉందని, ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని.. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని,  అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామని చెప్పారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అదనపు బలగాలు మోహరించాని, పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ ఘటన జరిగినా.. వెంటనే సమస్య పరిష్కరించామని వివరించారు.